Case Against Aghori: సనాతన ధర్మం పరిరక్షణే ధ్యేయమంటూ సమాజం ముందుకు వచ్చిన లేడీ అఘోరీ.. నిత్యం ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. నిన్న, మెున్నటి వరకూ ఆలయాల సందర్శన పేరుతో ఆయా దేవాలయాల వద్ద హల్ చేసిన అఘోరీ.. తాజాగా శ్రీవర్షిణి అనే యువతితో ప్రేమాయణం నడిపి చర్చకు తావిచ్చింది. ఈ క్రమంలోనే అఘోరీ తన భర్త అంటూ మరో స్త్రీ బయటకు రావడంతో అందరినీ షాక్ గురు చేసింది. ఈ క్రమంలోనే అఘోరీ తనను కూడా మోసం చేసిందంటూ మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అఘోరీపై కేసు
లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యోని పూజ చేస్తానని అఘోరీ తనను మోసం చేసిందని సైబరాబాద్ మెుకిలా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై ఫిబ్రవరి 25న పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా ఈ విషయం వెలుగు చూసింది. యోని పూజల పేరుతో తన వద్ద రూ. 9.8 లక్షలు అఘోరీ తీసుకున్నట్లు బాధిత మహిళ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. తాంత్రిక పూజల పేరు చెప్పి తనను బెదిరించిందని ఆమె ఫిర్యాదు చేసింది. అఘోరీని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను కోరింది.
తెరపైకి మెుదటి భార్య
మరోవైపు అఘోరీ తన మెుగుడు అంటూ మరో మహిళ మీడియా ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరిలో అఘోరీకి తనకు పెళ్లి జరిగినట్లు ఆమె ఆరోపించింది. ఆధ్యాత్మిక భావనతో తొలుత తనే అఘోరీ చెంత చేరానని.. ఆ తర్వాత ఇద్దరం దగ్గరైనట్లు బాధిత యువతి తెలిపింది. ఈ క్రమంలోనే జనవరి 1న అఘోరీ తనకు తాళి కట్టినట్లు ఆమె చెప్పింది. అయితే ఇప్పుడు శ్రీవర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్నట్లు అఘోరీ చెప్పడంతో ఇలా మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. పోలీసులు, మీడియా ప్రతినిధులు తనకు న్యాయం చేయాలని కోరింది.
Also Read: Puri Jagannath temple: పూరి క్షేత్రంలో అద్భుతం.. అందరూ చూస్తుండగా వింత ఘటన..
శ్రీవర్షిణితో ప్రేమ
మరోవైపు బీటెక్ యువతి శ్రీవర్షిణి (Sri Varshini)తో అఘోరీ ప్రేమాయణం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. తనను అఘోరీ విజయవాడలో పెళ్లి చేసుకుందని శ్రీవర్షిణి ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అతడు లేకుండా జీవించలేనని చెప్పింది. తాను మేజర్ అని.. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లనని ఆమె తేల్చి చెప్పింది. అఘోరీతోనే ఇకపై తన జీవితం ఉంటుందని అందరికీ స్ఫష్టం చేసింది. మరోవైపు అఘోరీ సైతం శ్రీవర్షిణి తన భార్య అంటూ స్పష్టం చేసింది.
నాగసాధువులు ఇలా ఉంటారా?
లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తనను తాను నాగ సాధువుగా ప్రకటించుకుంటోంది. అయితే సాధారణంగా నాగ సాగధువులు ప్రజల్లో అసలు తిరగరు. ప్రేమ, స్త్రీ వాంఛ వారికి అసలే ఉండదు. జనసంచారం లేని పర్వత ప్రాంతాల్లో వారు తపస్సులు చేస్తుంటారు. కుంభమేళా సమయంలో మాత్రమే జన సమూహంలోకి వస్తారు. అలా వచ్చినా కూడా ఎవరితోనూ మాట్లాడరు. పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి తమ ప్రదేశాలకు వారు వెళ్లిపోతుంటారు. అయితే గత కొంతకాలంగా లేడీ అఘోరీ వైఖరి చూస్తే ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పవచ్చు. పేరుకు నాగసాధువని చెప్పుకుంటున్నా ఆమె వ్యవహారశైలి అఘోరీలాగానే లేదంటూ విమర్శలు వస్తున్నాయి.