Bhu Bharati Portal: గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లే బంగాళ ఖాతంలో పడేసింది. దీంతో నేటి నుంచి ప్రజలకు విముక్తి కలగనున్నది. ధరణి స్థానంలో సోమవారం నుంచి భూ భారతిని అందుబాటులోకి రానున్నది. భూ భారతి చట్టం, పోర్టల్ ను ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నారు. సీఎం చేతుల మీదుగా లాంచింగ్ అయ్యే ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని రెవెన్యూ శాఖ అధికారులు చెప్తున్నారు. భూ సమస్యల పరిష్కారాలు సులువుగా జరిగేందుకు భూ భారతి పోర్టల్ లో ఈజీ ప్రాసెస్ ఉన్నదని ఆఫీసర్లు వెల్లడిస్తున్నారు.
ప్రత్యేక చార్ట్ బోర్డ్
సామాన్య రైతులకు అర్థమయ్యే రీతిలో ఈ పోర్టల్ లో కాలమ్స్ ను రూపొందించారు. సందేహాలకు, సమస్యలకు ప్రత్యేక చార్ట్ బోర్డ్ ను క్రియేట్ చేశారు. ధరణి ద్వారా జరిగిన నష్టాలు పునరావృతం కాకుండా వ్యవస్థను చక్కదిద్దేందుకు దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లే 35 మాడ్యూల్స్ ను కేవలం ఆరుకు కుదించారు. భూ భారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో సాప్ట్‌వేర్ మార్చేందుకు దాదాపు నాలుగు నెలలు పట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
అనతి కాలంలోనే
చట్టం అమలుకు అవసరమైన నిబంధనలు కూడా రూపకల్పన కావడంతో చట్టాన్ని పూర్తిస్థాయిలో నేటి నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. మరోవైపు ధరణి అమలు చేసినన్నీ రోజుల్లో నిబంధనలు ఏవీ రూపొందించకపోవడం గమనార్హం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అనతికాలంలోనే పూర్తిస్థాయిలో తీర్చిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు. సాధా బైనామాలు మినహా ధరణి సమస్యలు దాదాపు సమసి పోతాయని రెవెన్యూ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
ఆ మూడు మండలల్లో మ్యాన్ వల్..?
ఫైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన మూడు మండలాల్లో మ్యాన్ వల్ విధానంలో దరఖాస్తులు తీసుకోనున్నారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమల గిరి, రంగారెడ్డి జిల్లా కీసర, సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలాల్లో ఫైలట్ ప్రాజెక్టును నిర్వహించనున్నారు. సమస్యలను గుర్తించి ఫోర్టల్ లో ఇంకా ఏమీ మార్పులు చేయాల్సి ఉంటుందనేది అధ్యయనం చేయనున్నారు. వారసత్వ, 170 యాక్ట్, వక్ఫ్, ఇనాం భూముల్లో వచ్చే సమస్యలు వంటి వాటిపై స్టడీ చేస్తారు. ఓ స్పష్టత వచ్చిన తర్వాత క్రమంగా ఫోర్టల్ లోకి ఎక్కిస్తారు. ఈ మూడు మండలాల్లో ప్రత్యేక ఆఫీసర్లు పర్యవేక్షించనున్నారు. ఇక డేటా సేఫ్ గా ఉంచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ట్రాకింగ్ వ్యవస్థ
భూ భారతి పోర్టల్లో దరఖాస్తు చేస్తే ఇకపై భూ యజమాని ఫోన్ నెంబర్ కు SMSలు వస్తాయి. రైతుల అప్లికేషన్ స్టేటస్ చూసుకునేలా ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ధరణి పోర్టల్లో భూ దస్త్రాలు కనిపించేవి కావు. భూ భారతిలో ఎవరివైనా, ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసేలా ఏర్పాట్లు ఉంటాయి. ఎమ్మార్వో స్థాయిలో భూ సమస్య పరిష్కారం కాకపోతే ఆపైన ఆర్డీవోకు, అక్కణ్నుంచి కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చే ఉత్తర్వులతో విభేదిస్తే 30 రోజుల్లో భూ పరిపాలనా ట్రైబ్యునల్‌లో సవాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ల్యాండ్ ట్రైబ్యునళ్లు
భూ భారతి పోర్టల్ కు సంబంధించి ఏదైనా లీగల్ ఇష్యూస్ తలెత్తితే పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునళ్లు సైతం ఏర్పాటు చేస్తారు. భూ పరిపాలన ట్రైబ్యునల్ కమిషన్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. భూ సమస్యల విషయాల్లో రైతులకు న్యాయ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సర్కార్ మండల స్థాయిలో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తారు.
గత సర్కార్ లో అన్నీ చిక్కుముళ్లే!
ఇక గతంలో ధరణి అనేది ఓ పెను భూతంగా మారింది. అర్ధరాత్రి సమయంలోనూ మ్యూటేషన్లు జరిగాయంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రైతులు, సామాన్య ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. సర్వే నంబర్లు నుంచి, ల్యాండ్ మ్యూటేషన్లు, పాస్ పుస్తకాలు వంటి వరకు తప్పిదాలతోనే నెట్టుకొచ్చారు. దీని వలన అసలైన రైతులకు రైతు బంధు పడకపోగా, ధరణిలో ఎంట్రీ చేసిన పేర్లకు బంధు వెళ్లింది. రైతులు ఎదుర్కొన్న సమస్యలు ధరణిని ఫెయిల్ చేసింది. ధరణి సాప్ట్ వేర్ లో అత్యధిక మాడ్యుల్స్ పెట్టి, ఒకదానికొకటి ఇంటర్ లింక్ సిస్టంను అమలు చేశారు. దీని వలన సామాన్యులు ఓ సమస్యకు నాలుగై దు మాడ్యూల్స్ లో అప్లై చేయాల్సి వచ్చేది.
Also Read: Producer SKN: అన్నా లెజినోవా పై టాలీవుడ్ నిర్మాత ఆసక్తికర కామెంట్స్ .. వైరల్ అవుతున్న ట్వీట్
వాటితో కొత్త చిక్కులు
మాడ్యుల్స్, ఇంటర్ లింక్ సిస్టంను అమలు చేసిన సమస్య పరిష్కారం కాకపోగా.. ఇతర కొత్త చిక్కులను తెచ్చే పెట్టేదని రెవెన్యూ శాఖలోని ఓ కీలక అధికారి చెప్పారు. పైగా మాడ్యూల్స్ లో అప్లై చేసిన ప్రతీ సారి ప్రజలు డబ్బులు చెల్లించారు. టెక్నికల్ ఆపరేటర్లు డబ్బులు ఇచ్చి వేల మంది రైతులు నష్టపోయారు. వాళ్ల సమస్య పరిష్కారం కాకపోగా, ఆర్ధిక సమస్యల్లో రైతన్న కొట్టుమిట్టాడారు. మరోవైపు గత ప్రభుత్వంలో వారసత్వ భూములు పంచాయితీ లు ఎక్కువగా నడిచాయి. నిత్యం రెవెన్యూశాఖ, సీసీఎల్ ఏ లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణితో పాటు కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన వాణిల్లోనూ వారసత్వ భూములు సమస్యలపై కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు వచ్చాయి.
ఎలక్షన్ లో బెస్ట్ విమర్శనాస్త్రం..?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను విమర్శించేందుకు కాంగ్రెస్ ధరణి పోర్టల్ ను ప్రధాన విమర్శనాస్త్రంగా ఎంపిక చేసుకుంది. రైతులు, సామాన్య ప్రజలు పడ్డ కష్టాలను హైలెట్ చేస్తూ, గత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ప్రజల పాలిట శాపంగా మారిందని, భూ లావాదేవీలన్నింటినీ ఆన్ లైన్ ద్వారా నిర్వహించేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిందని కాంగ్రెస్ తనదైన శైలీలో గత ప్రభుత్వంపై ఎదురు దాడి చేసింది. ధరణితో దాదాపు 20 లక్షలకు పైగా రైతులు ఇబ్బంది పడ్డట్లు ఎన్నికల ప్రచారంలో వివరించారు. రైతుల కష్టాలను చూసిన కాంగ్రెస్ ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని హామీ ఇచ్చింది. చెప్పినట్లే ఈ రోజు నుంచి భూ భారతి అమల్లోకి రానున్నది.