Bhu Bharati Portal: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉండబోతున్నదని ఆయన వివరించారు. ఈ మేరకు ఆయన శనివారం ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూ భారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ కలిపి మూడు మండలాలను ఎంపిక చేయాలని సూచించారు.
ఆయా మండలాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్ధమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
Also read: Kancha Gachibowli Land: మంత్రుల మౌనరాగం.. అసలు కారణం ఇదేనా?
వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాష్, సీసీఎల్ఏ కార్యదర్శి మకరంద్ తదితరులు పాల్గొన్నారు.