Kamalapuram Students Failed: విద్యార్థులకు మంచి మార్కులు సాధించడమే పరమావధిగా ప్రతీ స్కూలు, కాలేజీ భావిస్తుంటాయి. గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించేందుకు అక్కడి టీచర్లు ప్రయత్నిస్తుంటారు. పరీక్షల్లో అనుసరించాల్సిన మెళుకువలను విద్యార్థులకు బోదిస్తూ.. మంచి మార్కులు సాధించేలా వారిని గైడ్ చేస్తుంటారు. అయితే ఏపీలోని ఓ ప్రభుత్వ కాలేజీ.. ఈ విషయంలో పూర్తిగా డీలాపడింది. దీంతో పరీక్షలకు హాజరైన విద్యార్థులు అందరూ ఫెయిల్ అయ్యారు.
టోటల్ ఫెయిల్
ఏపీలో ఇంటర్ ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రిజల్ట్స్ లో వైఎస్సార్ కడప జిల్లా కమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీకి బిగ్ షాక్ తగలింది. కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 33 మంది విద్యార్థులు అందరూ ఫెయిల్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ ఖాజా పర్విన్ స్వయంగా వెల్లడించారు. మరోవైపు సెకండ్ ఇయర్ పరీక్ష రాసిన 14 మందిలో ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఓవరాల్ గా కళాశాలలోని మెుత్తం విద్యార్థినుల్లో బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు మాత్రమే పాస్ అయినట్లు వివరించారు.
లోకేష్ భరోసా
రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఇంటర్ విద్యార్థులు.. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు. ఉత్తీర్ణత కాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలన్న లోకేష్.. తద్వారా జీవితంలో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు. మరోవైపు ఇంటర్ లో మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేసిన టీచర్లకు లోకేష్ అభినందనలు తెలియజేశారు.
Also Read: AP Inter Results: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ స్వేచ్ఛ వెబ్ సైట్ లో..
రాష్ట్రవ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం ఇలా
ఇంటర్ రిజల్ట్స్ ను నారా లోకేష్ స్వయంగా విడుదల చేశారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి మెుత్తం 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ లో 4,87,295 విద్యార్థులకు గాను 3,42,979 మంది (70%) పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ లో 4,22,030 గాను 3,51,521 మంది (83 %) ఉత్తీర్ణులు అయ్యారు. అటు వొకేషనల్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ లో 38,553 మందికి 23,991 (62 %) మంది సక్సెస్ అయ్యారు. రెండో ఏడాదిలో 33,289 పరీక్షలు రాస్తే 25,707 (77 %) మంది పాస్ అయ్యారు.