– అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటవ్వాలి
– దీనికోసం కవిత ఎంతో కష్టపడ్డారు
– కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR Participated In Mahatma Jyotirao Phule Jayanti Celebrations : కేసీఆర్ హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు లేవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్ములు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉంటారని, వారిలో జ్యోతిరావు ఫూలే ఒకరని అన్నారు.
సావిత్రి భాయ్ ఫూలే, జ్యోతిరావు ఫూలే పేద వర్గాలకు విద్య అందాలని 200 యేండ్ల క్రితమే అడుగులు వేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కేసీఆర్ ఆచరణలో పెట్టి చూపించారని తెలిపారు. బలహీన వర్గాల పిల్లల కోసం 1008 గురుకుల పాఠశాలలు పెట్టి, నాణ్యమైన విద్యను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు.
బీసీ బందు, దళిత బంధు పెట్టినప్పుడు అసూయ ద్వేషాలు వచ్చాయి, అయినా కేసీఆర్ వెనుకకు పోలేదన్నారు. శాసన సభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీసీలకు కేటాయించిన పార్టీ తమదేనని వ్యాఖ్యానించారు. బలహీన వర్గాల నాయకులకు పెద్ద పీట వేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నామన్న కేటీఆర్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టారు. ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వచ్చారు. సభలో బీసీ సబ్ ప్లాన్ తెస్తాం అని చెప్పారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు పెడుతామని చెప్పి మాట తప్పారు అంటూ మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే పూర్తి స్ధాయిలో బడ్జెట్ సమావేశాలు పెడుతామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ కింద నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. తమ నాయకురాలు కవిత దీనికోసం దీక్ష కూడా చేశారని, అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు కేటీఆర్.