Sri Sathya Sai District: పిల్లలు హోం వర్క్ రాయకుంటే రాయించాలి. కానీ ఓ టీచరమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పిల్లలను చెప్పుతో కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదెక్కడో జరిగింది అనుకుంటే పొరపాటే.. ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లాలో..
సాధారణంగా కొందరు పిల్లలు తమ హోం వర్క్ కంప్లీట్ చేసేందుకు మారాం చేయడం సహజమే. కొందరు తల్లిదండ్రులు వారిని భయపెట్టి మరీ హోం వర్క్ పూర్తి చేయిస్తారు. మరికొందరు టీచర్స్ అయితే స్కూల్ లో కంప్లీట్ చేయిస్తారు. కానీ హోం వర్క్ పూర్తి చేయడంపై కథల ద్వారా పిల్లలకు వివరిస్తే, ఇలాంటి పిల్లలలో మార్పు వస్తుంది. కానీ ఓ టీచరమ్మ తీవ్ర అసహనానికి లోనై, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహం అంటే ఏదో బెత్తంతో కొట్టిందని అనుకుంటే పొరపాటే, ఏకంగా చెప్పుతో కొట్టింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళితే..
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఓ ప్రవేట్ పాఠశాలలో 2 వ తరగతి విద్యార్థులు హోం వర్క్ పూర్తి చేయలేదు. అప్పుడే క్లాస్ కు వచ్చిన టీచర్ హోం వర్క్ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. మేడమ్.. హోం వర్క్ చేయలేదని కొందరు పిల్లలు లేచి నిలబడ్డారు. ఇంకేముంది మేడమ్ కు కోపం వచ్చింది. చెప్పుతో పిల్లలపై ప్రతాపం చూపింది. పాఠశాలలో ఏది జరిగినా, పూస గుచ్చినట్లు పిల్లలు ఇంటి వద్ద చెప్పడం కామన్. ఇదే విషయాన్ని పిల్లలు తమ గృహాలలో చెప్పారు.
Also Read: Bullet Removed from Brain: మెదడులో బుల్లెట్..12 గంటల శస్త్ర చికిత్స.. చివరికి ఏమైందంటే?
ఈ మాట వినడంతోటే తల్లిదండ్రులలో కోపం కట్టలు తెంచుకుంది. పాఠశాలకు చేరుకొని వారు ఆందోళన బాట పట్టారు. చిన్నారులపై ఇలా ప్రవర్తిస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు ఎంటర్ అయ్యారు. అయితే పాఠశాల యాజమాన్యం సారీ చెప్పడంతో, పిల్లల తల్లిదండ్రులు శాంతించి అక్కడి నుండి వెళ్లిపోయారు. మొత్తం మీద హోం వర్క్ పూర్తి చేయలేదని చెప్పుతో కొట్టడం ఏమిటని స్థానికులు సైతం టీచరమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు.