Passport Seva Mobile Van: ఒకప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా సర్టిఫికేట్ పొందాలంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టు తిరిగాల్సి వచ్చేది. కళ్లు కాయలు కాసేలా ప్రజలు ఎదురుచూసేవారు. కానీ ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆ అగచాట్లు తప్పాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లైన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఏపీ ప్రభుత్వమైతే ఏకంగా ఒక అడుగు ముందుకేసి ఇటీవల వాట్సప్ గవర్నెన్స్ సైతం తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఏపీలో మరో కీలక పురోగతి చోటుచేసుకుంది.
ఇంటివద్దకే పాస్ పోర్ట్
విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ తప్పనిసరి. అయితే ఆ పాస్ పోర్ట్ పొందడమనేది అంత సులువైన పని కాదు. దగ్గరలోని నగరానికి వెళ్లి.. అక్కడ గంటల తరబడి పాస్ పోర్ట్ కార్యాలయం వద్ద వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఈ ఇబ్బందుల నుంచి ఏపీ ప్రజలకు విముక్తి లభించింది. మెుబైల్ పాస్ పోర్టు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వ్యాన్ ద్వారా ప్రజల వద్దకే పాస్ పోర్ట్ ను చేరవేయనున్నారు.
విజయవాడలో లాంచ్
ప్రజల వద్దకే పాస్ పోర్ట్ సేవలు కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ (Kirti Vardhan Singh) ‘పాస్‌పోర్టు సేవా మొబైల్ వ్యాన్’ (Passport Seva Mobile Van) ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి (Sujana Chowdhary)తోపాటు పలువురు పాస్ పోర్ట్ అధికారులు పాల్గొన్నారు. ఈ మెుబైల్ వ్యాన్ లో నలుగురు సిబ్బంది అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లలేని వారు ఈ వ్యాన్ సాయంతో సేవలను పొందవచ్చని తెలిపారు.
Also Read: Bird Flu case: బర్డ్ ఫ్లూ కలవరం.. రంగంలోకి పోలీసులు.. కోళ్ల ఫారాల వద్ద పికెటింగ్!
ముందే సమాచారం
అయితే ఈ వ్యాన్ ఎప్పుడు, ఏ ప్రాంతానికి వస్తుందన్న విషయాన్ని ముందుగానే వెబ్ సైట్ లో పొందుపరచనున్నారు. ఈ వ్యాన్ ద్వారా సేవలను పొందాలని భావించిన వారు.. ముందుగా ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తగిన సర్టిఫికెట్లతో వ్యాన్ వద్దకు వెళ్తే.. అక్కడి సిబ్బంది వాటిని పరిశీలిస్తారు. ఫింగర్ ప్రింట్స్, మీ ఫొటోలు తీసుకొని ప్రక్రియను ముగిస్తారు. ఇచ్చిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత పాస్ పోర్ట్ నేరుగా ఇంటికే రానుంది.