BJP Somu Veerraju: మంత్రి పదవిపై బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి కావాలని లేదని, కావాలని అనుకుంటే 2014లోనే అయ్యే వాడిని అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై, ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి రాజమండ్రికి వచ్చిన వీర్రాజుకు అభిమానులు, కార్యకర్తలు, అనుచరుల నుంచి ఘన స్వాగతం లభించింది. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ నుంచి స్టేడియం రోడ్డు, బైపాస్ రోడ్డు, జైలు రోడ్డు మీదుగా మంజీరా హోటల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఏపీ బీజేపీ తరఫున భారీ అభినందన సభ జరిగింది. బాణాసంచా, తీన్మార్ డాన్సులు, గజమాలలతో భారీ ర్యాలీ కూడా జరిగింది. ర్యాలీలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు తదితరులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఇది చాలు..
అభినందన సభలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీర్రాజు మాట్లాడుతూ తన జీవితానికి ఎమ్మెల్సీ చాలన్నారు. ‘ బీజేపీలో కమిట్మెంట్‌తో పని చేశాను. దేశంలో దుమ్మున్న మగాడు ప్రధాని మోదీ. కూటమిలో కలవడానికి కారణం రాజకీయ వ్యూహం ఉంది.
త్వరలో తమిళనాడులోనే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఆక్వా రైతులు సమస్యలు పరిష్కారించాలని కేంద్రాన్ని కోరుతాం’ అని వీర్రాజు వెల్లడించారు. కాగా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, సోము అభిమానులు డాన్సులు వేసి కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.