Kodanda Reddy: రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. రైతు కమిషన్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని 3 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. దానిపై సుదీర్ఘంగా చర్చించారు. సాగువిస్తీర్ణం పెంచాలని అందుకు సంబంధించిన పలు సూచనలు చేశారు.
యాచారం మండలంలోని గడ్డమల్లయ్య గూడెం, మొండి గౌరెల్లి, చౌదరి గూడ గ్రామాలను ఎంపిక చేసినట్లు అధికారులు వివరించారు. ఆయా గ్రామాల్లో కూరగాయలు, ఆకు కూరలు పండించే రైతులకు ప్రభుత్వం నుండి ఏమి కావాలి అనేది గుర్తించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో వర్షపాతం, నీటి వనరులు తక్కువగా ఉంటాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని పంటల సాగుచేయాలని సూచించారు.
Also Read: HCU Land Issue: HCU భూముల వివాదం.. సెలబ్రిటీలపై కేసులు?
ఎఫ్పీఓ లను ఏర్పాటు చేసి రైతులను సంఘటితం చేయాలన్నారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూలతోటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధంచేయాలని ఆదేశించారు. ఉద్యాన వన పంటలకు రాయితీలపై యంత్ర పరికరాలు, డ్రిప్ లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతు కమిషన్ ఆధ్వర్యంలో ఒకటిరెండు రోజుల్లో అధికారుల కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల తోపాటు మార్కెటింగ్, నాబార్డు, ఎన్జీవో ప్రతినిధులు ఉంటారని వెల్లడించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్, మెంబర్ సెక్రెటరీ గోవిందు, కమిషన్ డీఏవో సంధ్యారాణి, అగ్రికల్చర్ అధికారి హరి వెంకట ప్రసాద్, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, నాబార్డ్ అధికారులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు