తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Dilsukhnagar Bomb Blast: ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు జీరో టోలెరెన్స్ విధానంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 11 ఏండ్ల బీజేపీ పాలనలో ఇలాంటి ఘటనలకు తావులేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందని వివరించారు.
ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టంచేశారు. దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని అన్నారు. తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడంతో ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైందన్నారు.
12 ఏండ్లుగా ఓ పీడకలలా వెంటాడుతున్న బాధితుల కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని తెలిపారు. ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించడం హర్షనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో బుజ్జగింపు రాజకీయాలు ఏ మాత్రం ప్రోత్సహించకూడదని, దీన్ని అన్ని రాజకీయపార్టీలు దీన్ని గుర్తుంచుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించడంలో కీలకపాత్ర వహించిందని కొనియాడారు. దేశ భద్రత కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరింత కఠిన చర్యలు ప్రభుత్వాలు అవలంభించాలని కేంద్ర మంత్రి సూచించారు.
Also Read: MLC Kavitha: కవిత ధర్నాకు వారు దూరం? అసలెందుకిలా?