Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వీలైనంత తొందరగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావిస్తున్నది. ఇందుకోసం గృహనిర్మాణ శాఖ అధికారులను మంత్రి సమాయత్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో జరిగే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని అప్పటికల్లా లబ్ధిదారులను ఎంపిక చేసి పునాది వరకు ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టేలా ప్రణాళిక రూపొందించుకున్నది.
ఇప్పటికే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని పైలట్ పద్ధతిన ఎంపిక చేసుకోగా మిగిలిన గ్రామాల విషయంలోనూ లబ్ధిదారులను ఫైనల్ చేసే ప్రక్రియను వేగవంతం చేసేలా కార్యాచరణ రూపొందింది. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నందున ప్రతీ గ్రామానికి ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు అందాయి.
అన్ని గ్రామాల్లోని ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించాయి. ముసాయిదా జాబితా రూపొందిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి తగిన సవరణలు చేసేలా యాక్షన్ ప్లాన్ ఖరారైంది. ఎమ్మెల్యేల సూచనలను కూడా గమనంలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీలైనంత తొందరగా లబ్ధిదారుల పేర్లను గ్రామాలవారీగా ఖరారు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
Also read: Kodanda Reddy: కర్షకులు ప్రకృతి సాగు వైపు దృష్టిపెట్టాలి’.. రైతు కమిషన్ చైర్మన్
ఆర్థిక, సామాజిక స్థితిగతుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అసంతృప్తికి తావు లేకుండా చూసుకోవాలని గృహనిర్మాణ శాఖ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నాలుగున్నర లక్షల ఇండ్లను మంజూరు చేయాలన్నది లక్ష్యంగా ఉన్నందున ఈ నెలాఖరుకల్లా డ్రాఫ్ట్ లిస్టు రూపొందించాలన్నది టార్గెట్.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ ఇండ్ల అంశాన్ని రాజకీయంగా వినియోగించుకునేందుకు వీలుగా పార్టీ నేతలు కూడా సన్నాహాలు మొదలుపెట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసేనాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పునాది స్థాయికి చేరుకోవాలని, ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ సబ్సిడీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాలనే నిర్ణయం తీసుకున్నది.
పైలట్ పద్ధతిలో ఇప్పటివరకు అమలుచేసిన ఫార్ములా ప్రకారం ప్రతీ మండలానికి ఒక గ్రామాన్ని ఎంపికైంది. దీంతో మొత్తం 72 వేల మంది లబ్ధిదారుల జాబితా ఫైనల్ అయింది. కానీ కొద్దిమంది లబ్ధిదారుల ఎంపికపై ఆరోపణలు రావడం, అర్హత లేకపోయినా సెలెక్ట్ చేశారనే అసంతృప్తి వ్యక్తం కావడంతో పరిశీలించిన గృహనిర్మాణ శాఖ అదికరులు దాదాపు 30 వేల మందిని పక్కకు తప్పించినట్లు సమాచారం. వీరి దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.