CWC on Musi (imagecredit:swetcha)
తెలంగాణ

CWC on Musi: మూసీకి ముప్పు.. కూడిపోతున్న జలాశయం.. హెచ్చరికలు జారీచేసిన సీ.డబ్ల్యు.సీ

నల్లగొండ బ్యూరో స్వేచ్ఛ: CWC on Musi: నాగార్జునసాగర్ ప్రాజెక్టు తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు మూసీకి ముప్పు పొంచి ఉంది. ఓవైపు మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తుండగా.. మరోవైపు జలాశయ నీటి సామర్థ్యం తగ్గి ఆయకట్టు విస్తీర్ణం తగ్గిపోయింది. ఉమ్మడి పాలకులకు తోడు గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం పుణ్యమంటూ మూసీ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యింది. పలుమార్లు ప్రాజెక్టు గేట్లు వరద నీటికి కొట్టుకుపోయిన నీరంతా సముద్రం పాలయ్యింది.

42వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన మూసీ ప్రాజెక్టు నేడు శిథిలావస్థకు చేరుకుంటోంది. ఏటా వరద నీటికి భారీగా మట్టి వచ్చి ప్రాజెక్టులోకి చేరుతోంది. ఇటీవల కేంద్ర జలసంఘం నిర్వహించిన సర్వేలోనూ మూసీ ప్రాజెక్టు 15 శాతానికి పైగా పూడిపోయినట్టు నివేదికతో సహా బహిర్గతం చేసింది. నిజానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నిండా ఉద్దండ నేతలే ఉన్నా.. మూసీ ప్రాజెక్టుపై మాత్రం శీతకన్ను వీడడం లేదు. మరోవైపు ప్రాజెక్టులో నీటి సామర్థ్యం తగ్గి రైతాంగం భారీగా నష్టపోతున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

స్కవర్ గేట్లు మూసివేయడంతోనే పూడిక..

మూసీ ప్రాజెక్టు నిర్మాణంలో అప్పట్లో మంచి టెక్నాలజీ వినియోగించారు. ప్రాజెక్టుకు గేట్ల కింది భాగంలో 10 స్కవర్ గేట్లను ఏర్పాటు చేశారు. వరద నీటిరూపంలో ప్రాజెక్టు గేట్ల వద్దకు చేరే మట్టి, బురదను స్కవర్ గేట్లు ఎత్తి బయటకు పంపే వీలు ఉంటుంది. అయితే 1987లో మూసీకి వచ్చిన వరద తాకిడికి 8వ నంబర్ స్కవర్ గేటు పూర్తిగా కొట్టుకుపోయింది. దాంతో శిథిలావస్థకు చేరిన 10 స్కవర్ గేట్లను కాంక్రీట్‌తో పూర్తిగా మూసేయడంతో అప్పటికీ సమస్య తీరిపోయింది.

Also Read: BRS vs Congress: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. నీటి విడుదలపై రాజకీయ రగడ.. వివాదం ఎందుకంటే?

కానీ ప్రాజెక్టు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని చెప్పాలి. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అడవుల్లో మొదలై హైదరాబాద్, భువనగిరి, నల్లగొండ జిల్లాల మీదుగా సూర్యాపేటకు వచ్చి చేరుతుంది. అయితే పైప్రాంతంలోని వరద నీటితో పాటు ఉపనదులు, వాగులు వంకల్లోని ఇసుక, మట్టి కొట్టుకుని ప్రాజెక్టులోకి భారీగా చేరుతుంది. ఈ పరిస్థితిని అప్పట్లోనే అంచనా వేసిన నిపుణులు మూసీ ప్రాజెక్టుకు స్కవర్ గేట్లు ఏర్పాటు చేశారు. కానీ గత పాలకులు వాటిని పట్టించుకోకుండా కాంక్రీట్‌తో స్కవర్ గేట్లను మూసేయడంతో సిల్ట్ బయటకు పోయే పరిస్థితి లేకపోయింది. దీంతో మూసీ ప్రాజెక్టు ఏటేటా పూడిపోతోంది.

30వేల ఎకరాలకు పడిపోయిన ఆయకట్టు.. 

మూసీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని 40 గ్రామాలకు చెందిన 41,800 ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగుకు నీటిని అందించేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆ సమయంలో ఆశించిన మేరకు వరద ప్రాజెక్టుకు చేరకపోవడంతో 1973లో దీన్ని యాసంగిలో ఆరుతడి పంటలకు నీటిని అందించే ప్రాజెక్టుగా మార్చిన అధికారులు సాగు విస్తీర్ణాన్ని 33వేల ఎకరాలకు కుదించారు.

నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మించిన మొదట్లో సదరు 4 నియోజకవర్గాల్లోని 45వేల ఎకరాలకు సాగునీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీటిని అందించిన ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాజెక్టులో పూడిక చేరడంతో ప్రస్తుతం కేవలం 30వేల ఎకరాలకు సైతం నీటిని అందించలేని దుస్థితికి చేరింది. పూడికతో నిండి ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. మూసీ ప్రాజెక్టులో పూడిక తొలగిస్తే.. దాదాపు 15వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం దక్కుతుంది. కొత్త ప్రాజెక్టులు నిర్మించడం కంటే.. ఉన్న ప్రాజెక్టులను కాపాడుకుంటే.. ఎన్నో వ్యయప్రయాసలు తప్పుతాయని రైతాంగం అభిప్రాయపడుతోంది.

మూసీ 15.32 శాతం పూడిపోయింది: కేంద్ర జలసంఘం

కేంద్ర జలసంఘం(సీడబ్ల్యుసీ) గతేడాది హైడ్రోగ్రాఫిక్‌, రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతతో నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును హెచ్చరించింది. దేశవ్యాప్తంగా 87జలాశయాలు పూడిక కారణంతో వేగంగా నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయని పేర్కొన్న సీడబ్ల్యుసీ సర్వేలో తెలంగాణలోని ఉస్మాన్‌సాగర్‌తో పాటు మూసీ జలాశయం ఉన్నాయి. మూసీ జలాశయంలో ఇప్పటికే 15.32 శాతం మేర సెడిమెంటేషన్‌(పూడిక) ఉందని పరిరక్షణ చర్యలు తప్పనిసరని ఈ సర్వే సూచించింది. 4.46

టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మితమైన మూసీ నిర్మించిన నాటి నుంచి 2024వరకు 0.74టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయి ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 3.72టీఎంసీలకు పడిపోయిందని పేర్కొంది. మూసీలో పూడిక తొలగింపు, పరిరక్షణ చర్యలు చేపట్టకుంటే 2084 నాటికి జలాశయ సామర్థ్యం ఒక టీఎంసీ మేర తగ్గిపోతుందని హెచ్చరించింది.

Also Read: Mahesh Kumar Goud: కేసీఆర్ వి పగటికలలే.. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉండదు.. టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?