TGCET Results 2025: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) ఆధ్వర్యంలో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన TG CET 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన 36,334 మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల కింద సీట్లు పొందినట్లు TG CET 2025 చీఫ్ కన్వీనర్ డాక్టర్ వి.ఎస్. అలగు వర్షిణి ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల ఫిబ్రవరి 23న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 89,246 మంది దరఖాస్తు చేసుకోగా, 84,672 మంది విద్యార్థులు హాజరయ్యారు.
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం మొత్తం 51,408 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇప్పటికే ప్రత్యేక కేటగిరీ కింద 1,944 మంది విద్యార్థుల ఫలితాలను వెల్లడించగా, తాజాగా 36,334 సీట్లకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. మిగిలిన 13,130 సీట్లకు సంబంధించిన ఫలితాలను దశలవారీగా వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : తెలంగాణలో మరోప్రాతానిక జియాలాజికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చిన సంస్థ.. అదేంటంటే!
TGSWREISతో పాటు TGTWREIS, TGMJBPWREIS, TGREIS వంటి సంస్థల సమన్వయంతో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించబడింది. ఈ సందర్భంగా డా. అలగు వర్షిణి మాట్లాడుతూ.. పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఈ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ సీట్లు కేటాయించే దిశగా కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
ఈ ఫలితాలతో రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు మరో అడుగు ముందుకు పడినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగిలిన సీట్ల ఫలితాల విడుదల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.