SC on Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులపై సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అక్కడ జరుగుతున్న అన్ని పనులను తక్షణం ఆపాలని ఆదేశించింది. అంతేకాదు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ (సీఎస్)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు, ఆమెను ప్రతివాదిగా చేర్చి పలు కీలక ప్రశ్నలు సంధించింది.
కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని అడవుల్లో చెట్లను నరికివేసి అభివృద్ధి పనులు చేపట్టడంపై సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అడవిలోని చెట్లను నరికేసి అభివృద్ధి చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. చెట్లను కొట్టివేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా..? అంటూ సీఎస్‌పై కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకున్నారా లేదా అని ప్రశ్నించింది. ఈ విషయంలో సమగ్ర సమాధానం కోసం రిట్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
Also Read: రైతన్నలు ఆందోళన చెందవద్దు.. మంత్రి పొంగులేటి
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ స్పాట్‌కు వెళ్లి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి అందిన రిపోర్టును పరిగణనలోకి తీసుకున్నామని, అక్కడ భారీగా నిర్మాణాలు జరగనున్నట్లు సమాచారం అందిందని సుప్రీం తెలిపింది. ఈ ఏర్పాట్లను కూడా నివేదిక ఆధారంగా గుర్తించామని కోర్టు పేర్కొంది. ఈ ప్రాంతం వన్యప్రాణులకు నిలయంగా ఉందని, నెమళ్లు, జింకలు, ఇతర పక్షులు ఎక్కువగా సంచరించే ప్రదేశంలో నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ విషయంపై లోతైన విచారణ కోసం నెల రోజుల్లో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ కమిటీ ఆరు నెలల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతవరకు కంచ గచ్చిబౌలిలో జరుగుతున్న అన్ని పనులపై స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇది చాలా సీరియస్ విషయం అని, హెచ్‌సీయూ అడవుల్లో ఏదైనా ఉల్లంఘన జరిగితే, దానికి తెలంగాణ సీఎస్‌దే బాధ్యత అని తెలిపింది. సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చినట్లు కోర్టు స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టు తెలంగాణ సీఎస్‌కు పలు కీలక ప్రశ్నలు సంధించింది. చెట్లను నరికివేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారని, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి తీసుకున్నారా? అన్ని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా..? అని ప్రశ్నించిన కోర్టు, ఈ విషయంలో పూర్తి సమాచారం అందించాలని ఆదేశించింది. ఈ ప్రశ్నలకు సమాధానంగా రిట్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
Also Read: నాడు డైవర్షన్.. నేడు పొలిటికల్ వర్షన్.. బీఆర్ఎస్ పై కేంద్రం ఫైర్..
కంచగచ్చిబౌలి ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పరిరక్షణ అంశాలను సుప్రీం కోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ‘ఇది వన్యప్రాణులు ఉండే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో నిర్మాణాలు ఎందుకు?’ అని కోర్టు ప్రశ్నించింది. పర్యావరణానికి హాని కలిగించే ఏ చర్యనైనా సహించేది లేదని స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఆదేశాలను ఎలా అమలు చేస్తుంది, కమిటీ ఏం నివేదిస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో అక్కడి పనులు నిలిపివేసినట్లు సమాచారం.