Bhuvanagiri Fort In Lok Sabha Constituency Elections
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లా ఎవరిదో..?

– 7 లక్షల బీసీల ఓట్లే కీలకం
– గెలుపుపై హస్తం ధీమా
– బీసీ కార్డుపై కమలం ఆశలు
– కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ
– పట్టు నిలుపుకునేందుకు హస్తం ఎత్తులు
– జాక్‌పాట్ కొడతాననే ధీమాలో బీజేపీ


Bhuvanagiri Fort In Lok Sabha Constituency Elections: లోక్‌సభ ఎన్నికల వేళ భువనగిరి నియోజకవర్గంలో ఆసక్తికరపోరు జరుగుతోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలను కలిపే ఈ నియోజక వర్గంలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలలో విస్తరించి ఉంది. ఈ ఎంపీ స్థానం పరిధిలోనే యాదాద్రి, కొమురవెల్లి వంటి పుణ్యక్షేత్రాలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఉనికిలోకి వచ్చిన ఈ స్థానంలో 2009లో కాంగ్రెస్, 2014లో బీఆర్‌ఎస్‌, 2019లో తిరిగి కాంగ్రెస్ గెలిచింది. 2024లో బీజేపీ తరపున బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్‌ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున క్యామ మల్లేష్ బరిలో నిలిచారు.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం పరిధిలోని 7 స్థానాలైన ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్(ఎస్సీ), తుంగతుర్తి, ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా, జనగామలో బీఆర్ఎస్ తరపున పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. ఈ సీటులో సుమారు 15 లక్షల ఓట్లున్నాయి. వీరిలో 3 లక్షల గౌడ్స్, 2 లక్షల కురుమలు, లక్షన్నర పద్మశాలీలున్నారు. ఎస్సీల ఓట్లు 2.5 లక్షలున్నాయి. మునుగోడు, జనగామ, ఆలేరు, నకిరేకల్ నియోజకవర్గాల్లో పద్మశాలీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు బీసీలు కాగా, కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి ఈ సీటును కేటాయించింది.


Also Read:కదులుతున్న డొంక!.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఈ సీటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో తనకున్న గ్రామస్థాయిలో బలంగా ఉన్న పార్టీ నిర్మాణం, సంప్రదాయ ఓటు బ్యాంకు కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలు. కోమటిరెడ్డి బ్రదర్స్ రెండు స్థానాల్లో ఎమ్మెల్యేలుగా ఉండగా, వెంకటరెడ్డి మంత్రిగా ఉండటం, వీరి స్వస్థలం నకిరేకల్ సెగ్మెంట్ పరిధిలో ఉండటమే గాక మరో మూడు సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుండటమూ హస్తం పార్టీకి కలిసొచ్చే అంశాలు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఈ స్థానంలోని పరిధిలోని 6 సీట్లు బీఆర్ఎస్ గెలిచినా, 2019 ఎంపీ ఎన్నికల్లో అంత ప్రతికూల పరిస్థితిలోనూ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొంది సంచలనం సృష్టించారు కనుక ఈసారి గెలుపు నల్లేరు మీద నడకే అనే అభిప్రాయం ఉంది. ఇక.. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్ని వర్గాలనూ కలుపుకొని పోవటమూ మరో సానుకూల అంశం.

ఈ స్థానంలో 2009, 2019 ఎన్నికల్లో నామమాత్రపు ఓట్లకే పరిమితమైంది. కానీ, 2014లో ఇక్కడ బరిలో నిలిచిన నల్లు ఇంద్రసేనారెడ్డి 1.83 లక్షల ఓట్లు సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఎంపీ సీటు పరిధిలో బీజేపీకి కేవలం 74 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, జాతీయ స్థాయిలో దూకుడుగా ఉన్న బీజేపీ, ఈసారి బీసీ కార్డును వాడి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను రంగంలో దించింది. వైద్యుడిగా, మాజీ ఎంపీగా ఆయనకున్న సంబంధాలు, బీసీల్లోని ఇతర కులాల ఓట్లూ దక్కించుకునే అవకాశం, మోదీ చరిష్మా, యువతలో బీజేపీకి ఉన్న అభిమానం, పట్టణ ప్రాంతాల్లో పట్టు, మూసీ ప్రక్షాళన ఉద్యమం ఇక్కడ ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు కాగా, గ్రామ స్థాయి నిర్మాణం లేకపోవటం, రాష్ట్రస్థాయి నాయకులెవరూ నర్సయ్య గౌడ్‌కు అండగా నిలిచి ప్రచారానికి రాకపోవటం పెద్ద మైనస్.

Also Read:ఫోన్‌ ట్యాపింగ్ ఫైల్స్

2014లో బీఆర్ఎస్ గెలిచిన ఈ సీటును నిజానికి ఏ నాయకుడు కోరింది లేదు. ఒక దశలో పైళ్ల శేఖర్ రెడ్డికి ఈ సీటు ఆఫర్ చేయగా, ఆయన తిరస్కరించారు. దీంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన క్యామ మల్లేశ్‌ను బీఆర్ఎస్ బరిలో నిలిపింది. 2014లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన మల్లేశ్, 2018లో బీఆర్‌ఎస్‌లో చేరారు. యాదవ, కురుమల ఓట్లు తనకే పడతాయని ఆయన చెబుతున్నా, బీసీ నేతలు బీజేపీ, కాంగ్రెస్‌లో చేరుతున్న సంగతి తెలిసిందే.

బీసీ ఓట్లపైనే పార్టీల ఆశలు

కాంగ్రెస్, బీజేపీలు బీసీ ఓట్ల మీద ఆశలు పెట్టుకున్నాయి. అయితే, బీసీ అభ్యర్థికే బీసీలంతా ఓటేస్తారని చెప్పలేము. బీసీలు గరిష్టంగా 50 శాతానికి మించి ఏ పార్టీకి గతంలో ఇక్కడ ఓటేయలేదు. ఈ పరిణామమే పునరావృతమైతే కాంగ్రెస్ గెలుపు సునాయాసమైనట్లే. ఒకవేళ మెజారిటీ బీసీలు.. బీసీ ప్రధాని నినాదానికి ఆకర్షితులైతే అప్పుడు బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నామమాత్రంగానే పోటీలో ఉండటంతో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. దీంతో ‘ఒక్క ఛాన్స్’ అంటూ బీజేపీ అంటున్న నినాదం పట్ల యువత ఆకర్షితులయ్యే అవకాశాన్నీ కొట్టిపారేసే అవకాశం లేదు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?