స్వేచ్ఛ మహబూబ్ నగర్: SLBC tunnel: ఎస్ ఎల్ బి సి సొరంగంలో ప్రమాదం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమనీ, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తూ, వారి కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలియజేశారు.
ఎస్ ఎల్ బి సి సొరంగంలో ప్రమాదం జరిగిన రోజు నుండి ( ఫిబ్రవరి 22) నేటి వరకు (ఏప్రిల్ 2) జరుగుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేక అధికారి శివ శంకర్ లో తేటి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మంత్రికి వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు నిష్ణాతులైన అధికారులు.
నాగర్ కర్నూలు జిల్లా యంత్రాంగం, నిర్విరామంగా తమ సేవలను అందిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నామని, సహాయక బృందాలకు కావలసిన సామాగ్రిని అందుబాటులో ఉంచుతూ అత్యంత ఆధునికమైన యంత్రాలతో విపత్కర పరిస్థితులలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు, నిరంతరాయంగా వస్తున్న నిమిషానికి పదివేల లీటర్ల ఊట నీటిని అత్యధిక సమర్థంగా పంపుల ద్వారా బయటికి తరలిస్తున్నట్లు, మట్టి తవ్వకాలను సహాయక బృందాల ద్వారా, ఆర్మీ హైడ్రా చెందిన ఎస్కవేటర్ల ద్వారా మట్టి తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్ట్ గుండా బయటికి పంపుతున్నట్లు, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన బృందాలు స్టీల్ ను కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు, సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆనవాళ్లు తెలుసుకునేందుకు కేరళకు చెందిన కడవర్ డాగ్స్ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు వివరించారు.
Also Read: CM Revanth reddy: అలా చేస్తే.. ప్రధాని మోడీని సన్మానిస్తా.. సీఎం రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమల పెంటలోని ఎస్ ఎల్ బి సి టన్నెల్ ను సందర్శించి, ఎస్ ఎల్ బి సి టన్నెల్ వద్ద సహాయక చర్యలపై ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడుతూ శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ( ఎస్.ఎల్.బి.సి) టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు 15 రోజుల్లో పూర్తికానున్నట్లు తెలిపారు. ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టు ద్వారా నల్గొండ – ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసే కృష్టానదీ జలాలు మరో రెండున్నర సంవత్సరాలలో అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు, ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రమాదస్తలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించిన అనంతరం వారి సూచనల మేరకు టన్నెల్‌లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని, మరో 105-110 మీటర్ల మేర త్రవ్వకాలు పూర్తయితే సమస్య ఓ కొలిక్కి వస్తుందని తెలిపారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో 250 మీటర్ల మేర రాళ్లు, మట్టి, బురద, కారణంగా సహాయక చర్యలకు అడ్డంకి ఏర్పడినట్లు తెలిపారు. గడచిన 40 రోజులుగా సుమారుగా 700-800 మంది వివిధ సంస్ధలకు చెందిన నిపుణులు పగలు రాత్రి అధికారుల పర్యవేక్షణలో పనిచేశారు. ప్రస్తుతం సుమారుగా 550-560 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టన్నెల్ లో భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర వస్తువులు అతుక్కుపోవడం వలన అక్కడ బురద తొలగింపు కష్టసాధ్యంగా, ప్రమాదకరంగా మారింది.
అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సహాయక చర్యలు చేపట్టేవారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రత్యేక పర్యవేక్షణాధికారి శివశంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఉన్నత అధికారులు, తదితరులు. అన్ని వేళలా అందుబాటులో ఉండేలా సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. ఎస్ ఎల్ బి సి సొరంగ ప్రమాదంలో రెండు మృతదేహాలు లభ్యం కాగా వారికి మిగలిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామని, ఈ ప్రమాదం నేపధ్యంలో టన్నెల్ తవ్వకం సందర్బంగా భవిష్యత్‌లో ఎటువంటి నష్టాలు వాటిల్లకుండా సంపూర్ణ చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.
జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఇందిరమ్మ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశంలో, ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, ఎన్ డి ఆర్ ఎఫ్ అధికారి డాక్టర్ హరీష్, సింగరేణి మైన్స్ రిస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్ డి ఆర్ ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి జయప్రకాష్, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి, నీటిపారుదల శాఖ డి ఈ శ్రీనివాసులు, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి, జి ఎస్ ఐ అధికారులు రాజశేఖర్, కడవర్ డాగ్స్ ప్రతినిధి ప్రభాత్, జె పి కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Palm Oil Crop: రైతన్నకు మంచి రోజులు.. అమాంతం పెరిగిన మద్దతు ధర..