CM Revanth reddy: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కుల గణన చేపట్టాం.. బీసీలకు రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన బీసీ గర్జన సభలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలహీన వర్గాల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల పెంపు కోసం ధర్మ యుద్ధం చేయాల్సి వస్తే సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీలో జరిగిన బీసీ గర్జన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల హక్కుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని వివరించారు. చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కొనసాగాలంటే జన గణనలో కుల గణన జరగాల్సిందే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కుల గణన చేపడుతుందని, దాని ఆధారంగా విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయ రిజర్వేషన్లను పెంచుతామని రాహుల్ గాంధీ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ మాటను నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని అన్నారు. తనది ఏ సామాజిక వర్గమైనా, ఆ మాట నిలబెట్టేందుకు ప్రయత్నించానని ఆయన తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులు తిరగకముందే బలహీన వర్గాల లెక్కలు తేల్చేందుకు శాసనసభలో తీర్మానం చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తమ పాలన ఏడాది తిరగకముందే కుల గణన పూర్తి చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఫిబ్రవరి 4న చట్టసభల్లో బిల్లులు పెట్టామని గుర్తు చేశారు. అందుకే ఈ రోజును సోషల్ జస్టిస్ డేగా ప్రకటించినట్లు ఆయన వివరించారు. తెలంగాణలో కుల గణన చేపట్టి, రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేసి దేశానికే దిక్సూచిగా నిలిచామని ఆయన అభివర్ణించారు.
Also Read: ఢిల్లీలో బీసీ పోరు.. గళమెత్తిన తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీ కోసం యువత గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడినప్పటికీ .. గత పాలకులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. నాటి దుర్మార్గ పాలకుడు యువత గోసను పట్టించుకోలేదని అన్నారు. ఎంత కొట్లాడినా, ఎందరు మరణించినా వారి చెవులకు ఎక్కలేదని విమర్శించారు. కానీ తన పాదయాత్ర సమయంలో తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఊడగొడతామని చెప్పానని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చిత్తశుద్ధిని చాటామని ఆయన తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్లు పెంచాలనే బలహీన వర్గాల కోరిక అసంబద్ధం కాదు, ధర్మబద్ధమైన కోరిక అని అన్నారు. ఈ కోరిక నెరవేర్చేందుకు బీజేపీ ముందుకు రావాలని, కానీ వారు బీసీ రిజర్వేషన్ల పెంపునకు విధానపరంగా వ్యతిరేకం అని ఆయన ఆరోపించారు. మొరార్జీ దేశాయ్ మండల్ కమిషన్ నియమిస్తే, వీపీ సింగ్ దాన్ని అమలు చేశారని, కానీ బీజేపీ కమండల్ యాత్రతో దాన్ని అడ్డుకుందని ఆయన విమర్శించారు. ఆ కమండల్ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ అని రేవంత్ పేర్కొన్నారు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలను ఆపేసి, 2025 వచ్చినా వాయిదా వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరా గాంధీని ఉదాహరణగా చూపిస్తూ.. ‘ఆమె దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన వారు కాదు. కానీ వారికి అమ్మలా వ్యవహరించి రిజర్వేషన్లు, ఇళ్లు, భూములు ఇచ్చారు. భూస్వాముల దగ్గర ఉన్న వేల ఎకరాలు గుంజుకొని ఎస్సీ, ఎస్టీలకు పంచారు. ఇప్పటికీ దళిత, ఆదివాసీ ఇళ్లలో ఆమె ఫొటోలు ఉన్నాయి’ అని ఆయన తెలిపారు. కానీ.. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికి బీజేపీ వ్యతిరేకం అని ఆయన అన్నారు.
Also Read: మంత్రివర్గ విస్తరణ.. మళ్లీ మొదటికొచ్చిందా? అసలేం జరుగుతోంది?
తెలంగాణలో రిజర్వేషన్లు పెంచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశం అని అన్నారు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే, 10 లక్షల మందితో సభ పెట్టి మోదీని సన్మానిస్తాం అని చెప్పారు. కానీ మోదీకి ఇందుకు ఇబ్బంది ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కుల గణన చేపట్టలేదని, తెలంగాణ మాత్రమే ఈ దిశగా ముందుకు సాగిందని ఆయన తెలిపారు.
రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో ధర్నా చేపట్టాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బండి సంజయ్ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారని, ఆయన ప్రాణం తమకు వద్దని, ఆయన వందేళ్లు జీవించాలని తమకు రిజర్వేషన్లు పెంచితే చాలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మేం ధర్మం కోసం హస్తినకు వచ్చామని, న్యాయమైన బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వచ్చామని ఆయన పేర్కొన్నారు.
రిజర్వేషన్ల పెంపునకు బలహీన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించాలని రేవంత్ తెలిపారు. మోదీ బీసీ రిజర్వేషన్లను ఆమోదించకపోతే, ఎర్రకోటపై జెండా ఎగురవేసి హక్కులు సాధిస్తాం అని ఆయన ఉద్ఘాటించారు. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు ఉండాలని, అందుకే కుల గణన చేపట్టి బీసీల లెక్క తేల్చామని ఆయన తెలిపారు. తెలంగాణ దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.