మహబూబ్ నగర్/గద్వాల స్వేచ్ఛ :Telangana farmers: ఆరుగాలం శ్రమించి వరి సాగు చేయగా పంట చేతికి వచ్చే దశలో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి.దీంతో రైతుల బాధ వర్ణనాతీతంగా ఉంది. జూరాల ప్రాజెక్టులో భాగంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద రబీ సీజన్‌లో వరిపంట చేతికి వచ్చే దశలో రైతులకు సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సక్రమంగా సాగునీరు అందక చివరి ఆయకట్టు పంట పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. . ఈ ఏడాది రబీ సీజన్‌లో ర్యాలంపాడు రిజర్వాయర్ ఆయకట్టు కింద ప్యాకేజీ 104, 105,107 కింద 14 వేల ఎకరాల్లో వరితో పాటు కొన్ని చోట్ల వేరుశనగ పంటను కే టి దొడ్డి,గట్టు మండలాల రైతులు సాగు చేశారు.
ప్రశ్నార్థకంగా ర్యాలంపాడు రిజర్వాయర్ ఆయకట్టు
గట్టు కేకే దొడ్డి మండలాలకు ప్రధాన ఆయకట్టు ప్రధాన వనరైన ర్యాలంపాడు రిజర్వాయర్ నీటి నిల్వ ప్రశ్నార్థకంగా మారింది. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 4 టీఎంసీలు ఉండగా రిజర్వాయర్ కు ఏర్పడ్డ నీటి లీకేజీల కారణంగా కేవలం 2 టీఎంసీల నీటిని మాత్రమే నిలువ ఉంచుతున్నారు. దీంతో ఆయకట్టు రైతులకు నీటి నిల్వ లేకపోవడం ప్రధాన శాపంగా మారింది. గతంలో పలుమార్లు సాగునీటి నిపుణుల బృందం రిజర్వాయర్ ను సందర్శించి లీకేజీలను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇటీవల సైతం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సాగునీటి నిపుణులు ప్రాజెక్టును సందర్శించారు.
Also read: Sri Rama Navami: శ్రీరామనవమి కి భద్రాచలం వెళ్తున్నారా.. ఈ రూల్స్ పాటించాల్సిందే
కాలువలకు సాగునీరు అందక ఎండుతున్న పంటలు
ర్యాలంపాడు రిజర్వాయర్ ఆయకట్టు కింద గట్టు మండలంలో 105,107 ప్యాకేజీలకు వారబందీ పద్ధతిలో సాగునీరు అందక పంటలు ఎండిపోతుండగా కేడిదొడ్డి మండలంలోని 104 ప్యాకేజీ పరిధిలో కొండా పురం, వెంకటాపురం, రంగాపురం, గువ్వలదిన్నె, ఇర్కిచేడ్ గ్రామాల్లో సుమారు 8 వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం ఆ పంటలకు నీరు అందక ఇరు మండలాలలో సుమారు 6 వేల ఎకరాలకు పైగా వరి పంటలు ఎండిపోయినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. బావులు,బోర్ల కింద ఎకరా, అర ఎకరాకు వీరు పారితే ఆ పంటను మాత్రమే రైతులు కాపాడుకుంటున్నారు. పంటలు ప్రస్తుతం చేతికి వచ్చే దశలో ఉండగా నీరు సక్రమంగా అందక పోవడంతో నేలలు నెర్రెలు బారాయి. మంత్రులు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు కర్ణాటకను నాలుగు టీఎంసీలు వదలాలని విజ్ఞప్తి చేసినా ఆశించిన మేరకు నీటిని విడుదల కాక ఎగువ నుంచి వంకలు వాగులు దాటి కేవలం ఒక టీఎంసీ మేరా మాత్రమే జూరాలకు నీరు చేరింది. ఈ నీటితో పంపింగ్ చేసి రిజర్వాయర్ నింపే పరిస్థితి లేదు.దీంతో పంటలు పొట్టదశ దాటి గింజలు పడుతుండగా ఎండిపోవడంతో చేసేది లేక పొలాల్లో పశువులను మేపుతున్నారు. పంట సాగు, దిగుబడిపై రైతులు ఆశలు సన్నగిల్లాయి. పెట్టిన పెట్టుబడి సైతం భూమి పాలు అయిందని రైతులు వాపోతున్నారు.
పంటలు చేతికొచ్చే దశలో నష్టపోయాం : గోవిందు కొండాపురం
కేటి దొడ్డి మండలంలో ప్యాకేజీ 104 ఆయకట్టు కాలువ కింద పంటలు సాగు చేశాం. నేను 5 ఎకరాలు వరి వేయగా అందులో సాగునీరు అందక మూడు ఎకరాలు ఎండిపోయింది 15 రోజులు నీరు విడుదల చేసినట్లయితే పంట చేతికి వచ్చేది నీరు రాకపోవడం వల్ల పెట్టిన పెట్టుబడి వృదా అయింది.