Nara Lokesh: నా చేతులు గీరారు.. నా చేయి కొరికారు.. అది కూడా మీరు నాపై చూపించిన ప్రేమగా భావించా అంటూ మంత్రి నారా లోకేష్ కామెంట్స్ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నారా లోకేష్.. గతంలో తన యువగళం పాదయాత్ర సాగిన తీరుపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటుచేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ, టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయోఎనర్జీ సీఈవో హరీంద్ర కే.త్రిపాఠితో కలిసి భూమిపూజ చేశారు.
దివాకరపల్లి వద్ద 475 ఎకరాల్లో, రూ.139 కోట్ల పెట్టుబడితో, 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సీబీజీ ప్లాంట్ ను ఏర్పాటుచేస్తోంది. రిలయన్స్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలిప్లాంటుకు బుధవారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో రూ.65వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్లను స్థాపించనుంది. తద్వారా 2.50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రిలయన్స్ దేశంలో 4 సీబీజీ హబ్ లను ఏర్పాటుచేయనుండగా అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటుచేస్తోంది. ముందుగా ప్లాంట్ ఆవరణలోకి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ మంత్రి నారా లోకేష్ ముందుకు సాగారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం .. చిత్తూరు, కడప జిల్లాలకు ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకొచ్చామన్నారు.
ప్రకాశం జిల్లాకు అతి పెద్ద పేపర్ మిల్లు తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ కంపెనీని తరిమేసింది. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాం .. ఇంకా ఉత్తరాంధ్రని, విశాఖను ఏకంగా ఐటీ ఫార్మా హబ్ గా మనం తయారు చేశామన్నారు. ఇంకా 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసని లోకేష్ అనగానే, ప్రజలు చప్పట్లు మారుమ్రోగించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచిందని, కొత్త కంపెనీలను తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రానికి తరిమేశారని వైసీపీని ఉద్దేశించి లోకేష్ అన్నారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా చరిత్రలో నేడు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుగా పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కృషి మరువలేనిదని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని చంద్రబాబు నాయుడు స్పీడ్ ఆఫ్ బిజినెస్ మార్చి పరిశ్రమలకు కావలసిన అనుమతులన్నీ వెంటనే ఇస్తున్నారని తెలిపారు.
Also Read: Raghurama Krishnam Raju: విచారణకు ప్రభావతి సహకరించాల్సిందే.. రఘురామ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు
సీఎం చంద్రబాబు నిద్రపోయేది రోజుకు 4 గంటలేనని, రాష్ట్రం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి అనగానే సభకు వచ్చిన ప్రజలు.. జై చంద్రబాబు అనగానే సభ దద్దరిల్లింది. యువతకు ఉపాధి కల్పించేందుకు చంద్రబాబు, లోకేష్ దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొస్తున్నారని, గత ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ తరలిపోయాయని మంత్రి విమర్శించారు.