TG Govt on Fine Rice (imagecrtedit:twitter)
తెలంగాణ

TG Govt on Fine Rice: హమ్మయ్య.. ఆ కష్టాలకు ఇక చెల్లు.. ఇది పేదవారి మాట.. ఎందుకంటే?

నల్లగొండ బ్యూరో స్వేచ్ఛ: TG Govt on Fine Rice: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సన్నబియ్యం పంపిణీ పథకం సంబురంలా మారింది. ఇన్నాళ్లూ దొడ్డు బియ్యం తినలేక సన్నబియ్యం కొనుగోలు చేయలేక పేదలు పడిన తిప్పలు అన్నీఇన్నీ కావు. మధ్య తరగతి కుటుంబాలు సైతం రేషన్ దుకాణాల్లో ఇచ్చే దొడ్డు బియ్యానికి తోడు సన్న బియ్యం కొనుగోలు చేసి ఇవి సగం అవి సగం కలుపుకుని వండుకుని తింటున్న గడపలు కోకొల్లలు. పేదలైతే పండుగ పూటనో.. ఇంటికి సుట్టాలొస్తేనో తప్పితే సన్నబియ్యం వండుకుని తినడం గగనమనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంపై సంబుర పడుతుండ్రు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 30 లక్షల మందికి సన్నబియ్యం అందనుంది. మరోవైపు రేషన్ బియ్యాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న అక్రమ దందాలకు రేవంత్ సర్కార్ చెక్ పెట్టినట్టయ్యింది. నిజానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రేషన్ బియ్యం దందా బీఆర్ఎస్ హయాంలో మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగింది. రేషన్ బియ్యం దందాలో అక్రమార్జనను రుచి చూసిన ఓ మాజీ ఎమ్మెల్యే ఏకంగా తానే స్వయంగా రైసు మిల్లు అద్దెకు తీసుకుని బియ్యం దందాకు తెరలేపిన ఘటనలు లేకపోలేదు. ఇలా నియోజకవర్గానికో కథ.. మండలానికో దందా లేకపోలేదు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థితి.. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం మొత్తం 10,07,011 రేషన్‌ కార్డులు ఉండగా.. ఇందులో 29,82,694 యూనిట్లు ఉన్నాయి. వీరి కోసం ప్రతి నెల ప్రభుత్వం 19 వేలకు పైగా మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయిస్తుంది. ఒక్క నల్లగొండ జిల్లాలో 4.66 లక్షల కార్డులుంటే.. 13.91 లక్షల యూనిట్లు ఉండగా, వీరికోసం 8,912 మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 3.24 లక్షల కార్డుల్లో 9.31 లక్షల యూనిట్లకు 5943 మెట్రిక్ టన్నుల బియ్యం, యాదాద్రిభువనగిరి జిల్లాలో 2.16 లక్షల కార్డుల్లో 6.59 లక్షల యూనిట్లకు 4215 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో కొత్తగా 50 వేల కార్డులు, లక్ష వరకు యూనిట్లు కలిసే అవకాశం ఉంది. దీంతో కొత్త కార్డులు కేటాయిస్తే ఉమ్మడి జిల్లాలో 10.50 లక్షల పైగా, యూనిట్లు 31 లక్షలకు చేరువయ్యే అవకాశం ఉంది.

రేషన్ బియ్యం దందాకు చెక్..   

కాంగ్రెస్ సర్కారు తీసుకున్న సన్నబియ్యం పంపిణీ నిర్ణయంతో రేషన్ బియ్యం అక్రమ దందాకు చెక్ పెట్టినట్టయ్యింది. రేషన్ దుకాణాల్లో ఇచ్చే దొడ్డు బియ్యం తినకపోవడం వల్ల దళారులు, అక్రమార్కులు ప్రజల వద్ద నుంచి కిలోకు రూ.6 నుంచి రూ.10 చెల్లించి రేషన్ బియ్యం తీసుకునేవారు. అలా ప్రతి నెలా సేకరించిన బియ్యాన్ని కోళ్ల ఫారాలు, బీరు కంపెనీలకు తరలించే వారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కాకినాడ, మహబూబ్ నగర్, ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు పెద్దఎత్తున తరలించేవారు.

Also Read: CM Revanth Reddy: యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. పనులు పరిశీలించిన సీఎం రేవంత్

ఈ రేషన్ బియ్యం దందాలో రేషన్ డీలర్ల దగ్గరి నుంచి జిల్లా స్థాయి అధికారులకు వరకు ఇన్వాల్వ్ అయ్యారు. కొంతమంది డీలర్లయితే ఏకంగా రేషన్ షాపుల్లోనే దుకాణం పెట్టేశారు. లబ్దిదారుల నుంచి వేలిముద్ర వేయించుకుని కిలోకు రూ.6 చొప్పున చెల్లించేవారు. ఈ దందాకు మండల స్థాయి అధికారుల నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు వాటాలు పంచుకోవడం పరిపాటి. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖ వాటాకైతే.. నెలవారీగా జీతాల తరహాలో అక్రమార్కులు చెల్లించేది. నల్లగొండ జిల్లాలో ఇటీవల రేషన్ బియ్యం దందాలో అక్రమార్కుల నుంచి పెద్దఎత్తున ఓ జిల్లా స్థాయి పోలీసు అధికారి అమ్యామ్యాలు పుచ్చుకున్నారని సమాచారం. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో సదరు అధికారిపై బదిలీ వేటు పడింది.

సీఎంఆర్ లెక్కల్లోనూ మిల్లర్ల చేతివాటం..   

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో రైసు మిల్లులు అత్యధికంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏటా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొనుగోలు చేసి బియ్యంగా మార్చి ఇచ్చేందుకు రైసు మిల్లులకు కేటాయించే వారు. అయితే సదరు రైసు మిల్లర్లు సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యాన్ని ఏండ్ల తరబడి ఇవ్వకుండా బొక్కేస్తుంటారు. ప్రభుత్వం టైట్ చేస్తే అప్పుడప్పుడు ప్రజల దగ్గరి నుంచి రేషన్ బియ్యం సేకరించి అవే బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి దొంగ లెక్కలు చెప్పడం ఇక్కడి ఆనవాయితీ. నిజంగా ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని మాత్రం అప్పటికే ఇతర రాష్ట్రాలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ దందా బీఆర్ఎస్ హాయంలో పదేండ్ల పాటు తారాస్థాయిలో జరిగింది. అయితే ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ నిర్ణయంతో మిల్లర్లలో ఒకింత ఆందోళన మొదలయ్యింది. గత సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన వడ్లను ఇప్పటికే మిల్లర్లు రాష్ట్రం దాటించేశారు. ఈనెల నుంచి దొడ్డు బియ్యం పంపిణీ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగించడం మిల్లర్ల అసలు రంగు బయటపడనుంది. ఇప్పటి నుంచైనా సీఎంఆర్ సజావుగా ప్రభుత్వానికి చేరుతుందో చూడాలి.

Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇక దంచుడే.. దంచుడు.. వర్షాలపై బిగ్ అప్ డేట్..

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?