– మహిళలనూ వదలని ట్యాపింగ్ టీం
– 40 మందిని వేధించినట్లు ఆధారాలు
– భారీగా వసూళ్లకు పాల్పడిన ఖాకీలు
– విచారణలో ఎమ్మెల్సీ పేరు ప్రస్తావన
– రెండు రోజుల్లో రానున్న క్లారిటీ
Telangana Phone Tapping Case Files: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. తవ్వేకొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ పేరుతో చేసిన దందాలు వెలుగుచూస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు విచారణ చేస్తున్నారు. తాజాగా పోలీసులు మరోక కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కానిస్టేబుల్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫోన్ ట్యాపింగ్‌లో మహిళల వ్యక్తిగత విషయాలతో బ్లాక్‌మెయిల్ చేసి బాగా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీస్ బాస్ సాన్నిహిత్యంతో పలు దందాల్లో జోక్యం చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశారు.
Also Read:పేద బిడ్డల ఫారిన్ చదువుకు మరింత సాయం
పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోట కూడా సంపాదించారు. నార్కట్ పల్లి వద్ద గంజాయి కేసులో.. నిందితుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కానిస్టేబుల్ రికార్డు చేశాడు. వందల మందికి సంబంధించిన ఫోన్ కాల్స్ రికార్డ్స్ సేకరించాడు. 40 మంది మహిళలపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. పేకాట దందాల్లోనూ నెలకు మామూళ్లు వసూలు చేశారు. దీంతో ఈ కేసులో ఇంకేం వెలుగులోకి వస్తాయి.. ఇంకేం సంచలనాలు నమోదవుతాయనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. ఇప్పటి వరకు పోలీసుల చుట్టే తిరిగిన ఫోన్‌ట్యాపింగ్ కేసు త్వరలో రాజకీయ నాయకుల మెడకు చుట్టుకోనుందా? టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్ కస్టడీ ముగిశాక.. దర్యాప్తు సాంతం రాజకీయ నాయకుల చుట్టే తిరుగనుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు ఔననే చెబుతున్నాయి. మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న విచారణలో నగరానికి చెందిన ఓ ఎమ్మెల్సీ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. టార్గెట్‌గా చేసుకున్న వ్యక్తుల ఫోన్లు, కార్యాలయాలకు 300 మీటర్ల దూరం నుంచే ట్యాప్ చేసే ఓ పరికరాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ పరికరాన్ని కొనుగోలు చేయడానికి సదరు ఎమ్మెల్సీ నిధులను సమకూర్చినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీకి నేడో రేపో నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆయనను విచారిస్తే.. మరికొందరు రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.