– 15 రెట్లు పెరగనున్న విద్యార్థుల సంఖ్య
– ఒక్కొక్కరికి రూ.20 లక్షల స్కాలర్‌షిప్
– శాఖల వారీ ప్రతిపాదనలపై అధికారుల కసరత్తు
– కోడ్ తర్వాత అమలుకు రంగం సిద్ధం
Government Will More Help For Foreign Education For The Poor Students: తెలంగాణలోని బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థుల విదేశీ విద్యకై ప్రభుత్వం అందించే సాయాన్ని మరింత మందికి విస్తరించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే బీసీ, ఎస్సీ, మైనారిటీ శాఖలకు చెందిన అధికారులు తమ శాఖల నుంచి అర్హులైన విద్యార్థుల వివరాలను ప్రభుత్వానికి పంపే పనిలో ఉన్నారు.
గత ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, మైనారిటీ శాఖల నుంచి 300, 250, 500 మంది విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు జరిగేది. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ఈ విద్యార్థుల సంఖ్య 15 రెట్లు కానుంది. ఈసారి 3000 మంది బీసీ విద్యార్థులు, 500 మంది ఎస్సీ విద్యార్థులు, 1000 మంది మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్యాపథకం కింద సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సీజన్ (మార్చి – జూన్)లోనే వారికి సాయం అందించి విదేశాలకు పంపాలని భావించినప్పటికీ, లోక్‌సభ ఎన్నికల కోడ్ అవరోధంగా మారటంతో కోడ్ ముగియగానే దీనిపై ప్రభుత్వం తక్షణ ప్రకటన చేయాలని భావిస్తోంది.
Also Read:కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్
ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు
ఈ విదేశీ విద్యా పథకం కింద అర్హులైన విద్యార్థులకు సంక్షేమశాఖలు రూ.20 లక్షల స్కాలర్‌షిప్‌తో బాటు విమాన ప్రయాణపు ఖర్చునూ భరిస్తాయి. ఈ పథకం కింద అనేకమంది దరఖాస్తు చేసినప్పటికీ, పేరున్న ఫారిన్ యూనివర్సిటీల్లో ఇప్పటికే అడ్మిషన్ పొందిన వారికి ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యతనిస్తోంది. గత రెండేళ్లుగా ఈ పథకానికి పెద్దసంఖ్యలో దరఖాస్తులు వస్తుండటంతో విద్యార్థుల మార్కులు, ఇంగ్లిష్ స్కోర్, కోర్సుకున్న ఆదరణ, దేశం, వర్సిటీ నేపథ్యం వంటి అంశాలను సంక్షేమశాఖల అధికారులు పరిశీలించి, శాఖల వారీగా రాష్ట్రస్థాయి కమిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించి.. అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.