నెల్లూరు, స్వేచ్ఛ: Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు నేతలు భావిస్తున్నారు. కాగా, తాటివర్తిలోని రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌కు సహకరించారని కాకాణిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, తర్వాత తనను అరెస్ట్ చేస్తారని భావించి ముందస్తుగానే కాకాణి ఇలా చేశారనే తెలుస్తున్నది. కాకాణి బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
వరుస సెలవులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి అజ్ఞాతంలోకి వెళ్లారని అనుచరులు చెప్పుకుంటున్నారు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో కాకాణి భేటీ అయ్యారు. అయితే మధ్యలోనే కార్యక్రమం నుంచి బయటికెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ విజయవాడ నుంచి లాయర్ ఫోన్ చేశారని చెప్పి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే రెండ్రోజులుగా ఏ క్షణంలోనైనా కాకాణి అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున హడావుడి జరిగింది.
Also read: Adinarayana Reddy: సినిమా చూపిస్తాం.. అతి త్వరలో.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
అసలేం జరిగింది?
మైన్‌ను కొల్లగొట్టి అక్రమంగా రూ.250 కోట్లకు పైగా దోచేసినట్లు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. దీంతో మైనింగ్, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ అభియోగంపై కేసులు కూడా నమోదు చేశారు. కాకాణి ఈ కేసులో నాలుగో నిందితుడిగా చేర్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సైదాపురం మండలం పరిధిలో ఉన్న మైన్లలో భారీగా తవ్వకాలు జరిగాయి. ఆ క్రమంలోనే పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టినట్లు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అక్కడ కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద రాష్ట్ర సరిహద్దులు దాటింది.
ఇతర దేశాల్లో ఆ ఖనిజానికి డిమాండ్ బాగా ఉండటంతో ధర కూడా బాగానే పలికిందంట. దాంతో మైనింగ్ నిర్వహించిన వారు కోట్లకు పడగలెత్తారు. అయితే అదంతా అక్రమమని గతంలోనే సోమిరెడ్డి రాష్ట్ర మైనింగ్ శాఖతో పాటు కేంద్ర మైనింగ్ శాఖలకు కూడా ఫిర్యాదు చేశారు. నాడు వైసీపీ అధికారంలో ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక కాకాణిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.