Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టడంతో ఈ కేసు మరోసారి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఆరో నిందితుడు (A6)గా గుర్తించబడిన శ్రవణ్ రావు ఒక మీడియా సంస్థ ఎండీగా ఉన్నాడు. ఈ కేసు నమోదైన తర్వాత విదేశాలకు పారిపోయిన ఆయన, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావడానికి భారత్‌కు తిరిగి వచ్చాడు. ఈ కేసు ప్రారంభం నుంచి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే..
కేసు నమోదు, శ్రవణ్ రావు పరారీ
ఫోన్ ట్యాపింగ్ కేసు గత ఏడాది మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ దర్యాప్తు ప్రారభమైంది. ఈ కేసులో SIB మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు (A1)గా ఉండగా, శ్రవణ్ రావు ఆరో నిందితుడిగా (A6) ఉన్నాడు. కేసు నమోదైన మరుసటి రోజే శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయాడు. అదే సమయంలో ప్రభాకర్ రావు కూడా అమెరికాకు వెళ్లిపోయాడు. ఈ ఘటన రాష్ట్రంలో అప్పట్లో సంచలనం సృష్టించింది.
కేసులో ప్రధాన ఆరోపణలు
ఈ కేసులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ ట్యాపింగ్ జరిగినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈ కేసులో ప్రణీత్ రావు (రిటైర్డ్ DSP), భుజంగరావు, తిరుపతన్న (ఇద్దరూ అదనపు SPలు), రాధాకిషన్ రావు (మాజీ రిటైర్డ్) వంటి పలువురు అధికారులు నిందితులుగా చేర్చారు.
Also Read: అలర్ట్.. అలర్ట్.. ఏప్రిల్ లో సగం రోజులు.. బ్యాంక్ సెలవులే..
దర్యాప్తు పురోగతి, అరెస్టులు
కేసు నమోదైన తర్వాత సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటై దర్యాప్తు చేపట్టింది. ప్రణీత్ రావును అరెస్టు చేసిన సిట్, ఆయనను విచారించగా ఇతర నిందితుల పేర్లు బయటపడ్డాయి. భుజంగరావు, తిరుపతన్నలను 2024 మార్చిలో అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. కానీ ఆయన విదేశాల్లో ఉండటంతో విచారణ ముందుకు సాగలేదు.
సుప్రీంకోర్టు జోక్యం..
ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాలకు పారిపోవడంతో, వారిని భారత్‌కు రప్పించేందుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. ఈ నోటీసులు 2024 జూలైలో జారీ అయినట్లు సమాచారం. అమెరికాలో ఉన్న వీరిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు అరెస్టు నుంచి ఊరట కల్పించింది. కానీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
Also Read: పొలాల్లో రైతులు.. చూసేందుకు వచ్చిన బిగ్ స్నేక్.. ఆ తర్వాత?
ఎట్టకేలకు హాజరు..
ఈ నెల 26న సిట్ శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేసింది. మార్చి 29న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించింది. శ్రవణ్ రావు అమెరికాలో ఉండటంతో ఈ నోటీసులను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఆదేశాల మేరకు శ్రవణ్ రావు మార్చి 28 రాత్రి 2 గంటలకు దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అనంతరం శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యాడు.
విచారణపై ఆసక్తి..
శ్రవణ్ రావు ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్నారు. విచారణలో ఆయన నోరు విప్పితే, ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఇతర నేతలు లేదా ప్రముఖుల ప్రమేయంపై కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు రాజకీయంగా సున్నితమైన అంశంగా మారడంతో, శ్రవణ్ రావు ఏం వెల్లడిస్తాడనే దానిపై అందరి దృష్టి నెలకొని ఉంది.
ప్రస్తుతం దర్యాప్తు బృందం శ్రవణ్ రావును విచారిస్తోంది. ఈ విచారణ ఫలితాలు ఈ కేసును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రభాకర్ రావు ఇంకా అమెరికాలోనే ఉన్నందున, శ్రవణ్ రావు విచారణ ఈ కేసుకు పురోగతి లభిస్తుందని పోలీసు వర్గాలు ఆశిస్తున్నాయి.