Telangana Govt: ఉపాధి నిమిత్తం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇబ్బందుల్లో చిక్కుకుని మృత్యువాత పడిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చొరవ తీసుకున్న ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాలు విడుదల చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి తదితర ఏడు జిల్లాలకు చెందిన 66 మంది బాధిత కుటుంబాలకు తలా రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 3.30 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
Also Read: Telangana Govt : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగాల జాతరే..
గతంలో 103 కుటుంబాలకు రూ. 5.15 కోట్లను రిలీజ్ చేసింది. గల్బ్ బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చినందున ఇప్పటివరకు మొత్తం 169 మందిని గుర్తించి ఆర్థికంగా సాయం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్ గ్రేషియా నేరుగా బాధిత కుటుంబాల్లోని వారసుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి తెలిపారు.
Also Read: Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుండి రద్దీ సమాచారం.. మీచేతిలోనే..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణా రావుతో సమన్వయం చేసి నిధులు విడుదల అయ్యేందుకు చొరవ తీసుకున్నట్లు అనిల్ ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన 28, జగిత్యాల జిల్లాలో 19, కామారెడ్డి జిల్లాలో 9, నిర్మల్ జిల్లాలో 7 ఉండగా మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 66 కుటుంబాల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత (2024-25) ఆర్థిక సంవత్సరంలో మొత్తం 169 మందికి ఇప్పటిదాకా రూ. 8.45 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని వివరించారు.