తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Telangana Govt: గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా రేషను దుకాణాల్లో ఉగాది పండగ రోజు నుంచి సన్న బియ్యాన్ని అందించేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని పండగ రోజు హుజూర్‌నగర్‌లోని మట్టపల్లిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై దృష్టి పెట్టిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంతకాలం రేషను దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం సరఫరా జరిగిందని, ఇకపైన సన్న బియ్యం అందుకోనున్నారని మంత్రి ఉత్తమ్ సచివాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలోని సుమారు 90 లక్షల రేషను కార్డులున్న 2.85 కోట్ల మందికి సన్న బియ్యం అందున్నాయని, కార్డులు లేకపోయినా లబ్ధిదారుల జాబితాలో ఉంటే ఈ సౌకర్యాన్ని అందుకోవచ్చని వివరించారు.
Also read: Telangana Govt : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగాల జాతరే..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అందిస్తున్న బియ్యాన్ని చాలా మంది లబ్ధిదారులు వినియోగించడంలేదని, డీలర్ల దగ్గరి నుంచి తీసుకున్నా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని, చివరకు రైస్ మిల్లుల్లో పాలిష్ అయ్యి సన్న బియ్యంగా బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లిపోతున్నాయని మంత్రి తెలిపారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఏ రేషను దుకాణం నుంచి అయినా సన్న బియ్యాన్ని తీసుకునేలా డ్రా సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 89.73 లక్షల రేషను కార్డులు ఉంటే పదేండ్లలో కొత్తగా 49,479 జారీ అయ్యాయని, ఇకపైన ఎంతమందికి కార్డులు అవసరమున్నా వారి అర్హతకు అనుగుణంగా ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.
రేషను బియ్యం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఏటా రూ. 10,665 కోట్లను ఖర్చు చేస్తున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సన్న బియ్యంతో పాటు త్వరలోనే పప్పు, ఉప్పు తదితర మరికొన్ని నిత్యావసర వస్తువులను కూడా రేషను దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు.
Also read: Transgenders Protest: బీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి.. కారణం ఎవరంటే?
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీచేసే రేషన్ కార్డుల్లో క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, ఎలక్ట్రానిక్ చిప్ ఉండదని మంత్రి ఉత్తమ్ ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. రేషను కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ఉంటుందా అనే ప్రశ్నకు.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని బదులిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషను కార్డులకు భారీ డిమాండ్ ఉన్నదని, వచ్చిన దరఖాస్తులన్నింటినీ నిశితంగా పరిశీలించి అర్హత ఉన్న కుటుంబాలన్నింటికీ జారీచేస్తామని మంత్రి స్పష్టం చేశారు. దాదాపు 30 లక్షల మేర కొత్త కార్డులు జారీచేసే అవకాశమున్నదన్నారు. ఇప్పటికే 90 లక్షల కార్డులు వినియోగంలో ఉండగా కొత్తగా వచ్చే 30 లక్షలతో కలిపి దాదాపు 1.20 కోట్ల కార్డులు కానున్నాయి. మొత్తం 1.35 కోట్ల కుటుంబాల్లో కేవలం 15 లక్షల కుటుంబాలకు మాత్రమే కార్డులు ఉండవని మంత్రి వివరణతో స్పష్టమవుతున్నది.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/