జహీరాబాద్ స్వేచ్ఛ: Zaheerabad News: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో గల నారింజ ప్రాజెక్ట్ నియోజకవర్గానికి గుండెకాయ లాంటిది. ఈ ప్రాజెక్టులో నీరు నిలువ ఉంటే నియోజకవర్గంలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి మండలాల్లో భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి. నారింజ కారణంగా ఇక్కడి బోరు, బావుల్లో నీరు సమృద్ధిగా చేరడంతో అత్యధిక శాతం రైతులు చెరుకు పంట వైపు మొగ్గు చూపుతుంటారు. సంగారెడ్డి జిల్లాలోనే జహీరాబాద్ నియోజకవర్గంలో లక్షల టన్నుల చెరుకు సాగు అవుతుండటం చేత నాడు ఇక్కడ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసారు. నారింజ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నా కొందరి స్వార్ధం, మరికొందరి నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు నీటికే ముప్పు వాటిల్లుతోంది.
నారింజ ప్రాజెక్టు లో జలకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న వ్యర్ధ జలాలు కలవడంతో నీరు కలుషితం అవుతోంది. బైపాస్ మీదుగా భరత్ నగర్ వైపు నుండి దిడిగి గ్రామానికి వెళ్లే పాత దారిలో ఉన్న లోతైన గోతులలో కర్మాగార వ్యర్ధ నీటిని వదులుతున్నారు. అల్గొల్ గ్రామ శివారులో సైతం ఇదే తతంగం సాగుతోంది. ఇటీవల చేపలు కూడా మృతి చెందాయి. వర్షాలు పడటమే ఆలస్యం ట్యాంకర్ లలో వ్యర్థలను తెచ్చి డంప్ చేస్తుండటం మూలంగా నీటిలో కలిసి నేరుగా నారింజలోకి వెళ్తున్నాయి. దింతో నారింజ నీరు రంగు మారుతోంది.
Also Read: Dangerous Snake: సముద్రంలో ఉండే వింత పాము.. బయటకొస్తే ప్రళయమే?
పశువులు సైతం ఈ నీటిని సేవించడం లేదని, చేపలు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. వ్యర్థాలను పారేస్తున్న ప్రాంతంలో ఫారెస్ట్, ఇతర భూముల్లో ఉన్న చెట్లు పూర్తిగా ఎండుముఖం పట్టాయి. ట్యాంకర్లు అర్ధరాత్రి వస్తుండటంతో నేలపై మేకులు(మొలలు) పాతారు. అయిన ఫలితం లేకుండా పోతోంది. పీసీబీ అధికారులలో మాత్రం కదలిక లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వారి దృష్టికి పోయిన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని నారింజ నీరు కలుషితం కాకుండా, చేపలు మృతి చెందకుండా చూడాల్సిన అవసరం ఉంది.
ఎంతటి వారైనా చర్యలు: ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్
వాతావరణాన్ని, అటవీ సంపదను నష్టం చేసే వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సాలెహ అఫ్రోజ్ పేర్కొన్నారు. వ్యర్థాలను డంప్ చేస్తే ఊరుకునేది లేదని, స్వయంగా స్పాట్ విజిట్ చేసి యాక్షన్ తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇరిగేషన్ ఏఈ జానకిరామ్ వివరణ
దిడిగి వెళ్లే దారిలో వ్యర్థలను డంప్ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఇరిగేషన్ శాఖ ఏఈ జానకిరామ్ అన్నారు. స్పాట్ విజిట్ కూడా చేశామని, ఎవరు వ్యర్థలను వేస్తున్నది తెలియరాలేదని, ఆ సమయంలో అటవీ శాఖ అధికారిని కూడా స్పాట్ విజిట్ చేసి తమతో చర్చించారన్నారు. పోలీసులకు నిఘా పెట్టమని కోరడం జరిగిందన్నారు.
పీసిబీ ఈఈ ఏమంటున్నారంటే..
ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇటీవల శాంపిల్ సేకరించామని పీసిబీ ఈఈ సంగీత తెలిపారు. ఈ నెల 28 న మరో సారి శ్యాంపుల్స్ సేకరించి పరీక్షస్తామని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే అక్కడ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కాలుష్య జలమే కారణం: నరోత్తం
నారింజలో కలుషిత నీరు చేరడంతోనే నీటి రంగు మారిందని, కెమికల్ నీరు ఇందుకు కారణమని ఇరిగేషన్ శాఖ మాజీ అధికారి వై. నరోత్తం అన్నారు. తాను స్పాట్ చూసానని, అధికారులకు సైతం ఫిర్యాదు చేసానని అయన పేర్కొన్నారు.
Also Read: MLA Sambasiva Rao: కాళేశ్వరం కంటే ఆ ప్రాజెక్ట్ బెటర్.. సీపీఐ నేత ఆసక్తికర వ్యాఖ్యలు