CM Revanth on Delimitation: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Sessions) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సభలో కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తీరును నిరసిస్తూ ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారు. జనాభా నియంత్రణ శాపం కాకూడదన్న రేవంత్.. జనాభా తగ్గిన రాష్ట్రాలు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోవడానికి వీల్లేదని అసెంబ్లీలో అన్నారు. దేశాన్ని కాకుండా రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని నియోజకవర్గ పునర్విభజన జరగాని రేవంత్ పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
24 శాతమే ప్రాతినిథ్యం
డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించాలని కేంద్రం చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. 1971 జనాభా లెక్కల తర్వాత.. కేంద్రం జనాభా నియంత్రణకు విధివిధానాలు తీసుకొచ్చిందని రేవంత్ గుర్తు చేశారు. కేంద్ర ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పక్కాగా అమలు చేసి జనాభాను నియంత్రించాయని పేర్కొన్నారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలు కేంద్ర ఆదేశాలను బేఖాతరు చేయడంతో అక్కడ జనాభా విపరీతంగా పెరిగిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో 553 లోక్ సభ స్థానాలకు గాను సౌత్ నుంచి 130 సీట్లకు మాత్రమే ప్రాతినిథ్యం ఉన్నట్లు రేవంత్ అన్నారు. 100 శాతంలో మన ప్రాతినిథ్యం 24 శాతం మాత్రమేనని చెప్పారు. లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు మరింత నష్టం తప్పదని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: CID Inquiry on Lady Aghori: లేడీ అఘోరీ లక్ష్యమేంటి? రంగంలోకి సీబీ సీఐడీ?
పార్టీలు కలిసిరావాలి
డీలిమిటేషన్ పై రాజకీయాలకు అతీతంగా ఒకే మాటపై నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అటు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలను విభజించాలని రేవంత్ కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రయోజనం కోసం జమ్ముకశ్మీర్, అసోంలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాయని సీఎం ఆరోపించారు. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని ఉన్నా కేంద్రం ఇప్పటివరకూ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం పెట్టే తీర్మానానికి పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరు మద్దతు తెలిపాలని ఈ సందర్భంగా రేవంత్ కోరారు. అవసరమైతే పోరు బాట పడతామని సీఎం వ్యాఖ్యానించారు.
వాజ్ పెయీ వ్యతిరేకించారు
1971లో రాజ్యాంగ సవరణతో డీలిమిటేసన్ ప్రక్రియను 25 ఏళ్లుగా నిలిపివేసిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. లోక్ సభ స్థానాల పునర్విభజనపై నేటికి గందరగోళం నెలకొని ఉందని అన్నారు. ఇటీవల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల అఖిల పక్ష భేటిలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లు గుర్తుచేశారు. అటు జనాభా ఆధారంగా నియోజక వర్గాల విభజనను మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత వాజ్ పేయీ (Atal Bihari Vajpayee) సైతం వ్యతిరేకించారని రేవంత్ అన్నారు. రాష్ట్రాలతో సంప్రదింపులు లేకుండా డీలిమిటేషన్ చేపట్టడాన్ని రేవంత్ తప్పుబట్టారు.