Betting Case: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిన సర్కార్ ఇప్పుడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌ల భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం క్లబ్‌లపై నిషేధం విధించడంతోపాటు గ్యాంబ్లింగ్ చట్టాన్ని తీసుకురావడంతో అక్రమ మార్గాల్లో మొబైల్ బెట్టింగ్ యాప్‌లు పుట్టుకొచ్చాయన్నది పోలీసుల అంచనా. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం వెనక పొలిటీషియన్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌజ్‌లు కేంద్రంగా ఈ యాప్‌లతో భారీ ఎత్తున లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారముంది. రాష్ట్రానికి చెందిన 11 మంది ప్రమోటర్లు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు మరిన్ని వివరాలను సేకరించడంపై దృష్టి సారించారు. ఇప్పటికే వీరికి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దగ్గర ఉన్నట్లు గుర్తించారు. త్వరలో వాటిని తీసుకునే అవకాశమున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా బెట్టింగ్ యాప్‌ల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించడంతో వీటి వెనక ఉన్న కొందరు రాజకీయ నేతల్లో గుబులు మొదలైంది. ఒక మాజీ మంత్రి, ఆయన అనుచరులు ఈ యాప్‌ల నిర్వహణలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నట్లు ప్రభుత్వం దగ్గర సమాచారం ఉండడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగిన తర్వాత ఎవరెవరి వివరాలు బహిర్గతమవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
మేడ్చల్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, శంకర్‌పల్లి పరిసర ప్రాంతాల్లోని కొన్ని ఫామ్‌హౌజ్‌లే కేంద్రంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌లు నడుస్తున్నట్లు పోలీసుల అనుమానం. చైనా నుంచి భారీ మొత్తంలో ముడుపులు అందాయన్న అనుమానం కూడా ఉన్నది. ఇక దుబాయ్‌తో హైదరాబాద్‌కు ఉన్న లింకులపైనా పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు.
అక్రమంగా నడిచే మొబైల్ బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కి అప్పులపాలై యువత ఆత్మహత్యలు చేసుకోవడం రాష్ట్రంలో ఒక అసాధారణ పరిస్థితి అనే అభిప్రాయంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. దీనికి అడ్డుకట్ట వేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలో ‘సిట్’ ఏర్పాటైన తర్వాత ఈ వ్యవహారం వెనక ఉన్నదెవరనే అంశం వెలుగులోకి రానున్నది.
గత ప్రభుత్వం క్లబ్‌లలో గ్యాంబ్లింగ్‌ను నిషేధించిన తర్వాతనే ఈ యాప్‌లు వినియోగం ఉధృతమైందని, వీటి వెనక గులాబీ నేతలు ఉన్నారనేది బలమైన ఆరోపణ. ఇన్‌ఫ్లూయెన్సర్స్ తో అవగాహన కుదుర్చుకోవడం, భారీ మొత్తానికి ఒప్పందం చేసుకోవడం, మీడియేషన్ చేయడం, ఆర్థిక లావాదేవీలు చోటుచేసుకోవడం.. ఇలాంటి అన్నింటి వెనక ఓ మాజీ మంత్రి అనుచరవర్గం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లను యూ ట్యూబ్‌ల ద్వారా ప్రమోట్ చేయడంపై ఇప్పటికే ఈడీ ఆరా తీసినందున ఆ వివరాలను రాష్ట్ర పోలీసులు సేకరించనున్నారు.
Also Read: Minister Seethaka: మహిళలకు సూపర్ ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన మంత్రి సీతక్క..
యూ ట్యూబ్ ద్వారా వారికి వచ్చిన ఆదాయం వివరాలపైనా దృష్టి పెట్టనున్నారు. కొన్ని వివరాలు ఇప్పటికే రాష్ట్ర పోలీసుల దగ్గర ఉన్నాయి. గతంలో సేకరించిన ఈ వివరాలతో ఈడీ కొంత వరకు దర్యాప్తు చేపట్టింది. ఆర్థిక అంశాలపై వివరాలను సేకరించింది. ఇప్పుడు వీటిని ఈడీ నుంచి స్టేట్ పోలీసులు అందుకోనున్నారు. సంవత్సరానికి సగటున రూ. 1200 కోట్ల మేర హైదరాబాద్ కేంద్రంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక అంచనా. ‘సిట్’ దర్యాప్తు తర్వాత లోతైన వివరాలు వెల్లడి కానున్నాయి. ఎవరి పేర్లు బైటకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఇక్కడ https://epaper.swetchadaily.com/ క్లిక్ చేయండి