Swetcha Effect: ములుగు జిల్లా ఆదివాసీ రైతుల అమాయకత్వంతో పలు అంతర్జాతీయ కంపెనీలు చెలగాటమాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ‘స్వేచ్ఛా’ ఇచ్చిన వరుస కథనాలతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. విత్తనసాగు పేరుతో ఆయా కంపెనీ చేస్తున్న అరాచకాలపై నిజా నిజాలు తేల్చేందుకు రైతు సంక్షేమ కమీషన్ విచారణ చేపట్టింది. ఈ మేరకు మలుగు జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు పాల్గొని చర్చించారు. ఈ భేటికి సంబంధిత ఉన్నతాధికారులతో పాటు మెుక్కజొన్న సాగు చేసే బాధిత రైతులు హాజరయ్యారు.
సమస్యలపై సమీక్ష
ములుగు జిల్లా కలెక్టరేట్ (Mulugu District Collectorate) లో దాదాపు 3 గంటల పాటు సాగిన విచారణలో బాధిత రైతుల సమస్యలను నేరుగా తెలుసుకున్న రైతు సంక్షేమ కమీషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి.. దానిపై అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. నిపుణుల కమిటీ పర్యటనలో పరిశీలించిన అంశాలను అధికారుల ముందు ఉంచి వివరాలు రాబట్టారు. ఈ సందర్భంగా మొక్కజొన్న సాగు బాధిత రైతులతో కమిషన్ చైర్మన్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు ఉండే విత్తన హక్కు.. కంపెనీల పరమై కర్షకులకు హక్కులకు భంగం కలిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక భూమి హక్కులు తిరిగి రైతులకు ఇచ్చే విధంగా కొత్త చట్టం తేవడం.. భూ భారతి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వం వల్లే..
గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అమెరికా కంపెనీ చేతికి తెలంగాణ రైతుల రికార్డులను అప్పజెప్పిందని రైతు సంక్షేమ కమీషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఎన్ఐసీకి అప్పజెప్పిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వలో విత్తన నియంత్రణ , ధర నిర్ణయంలో అన్ని వ్యవస్థలు బాధ్యతగా విధులు నిర్వహించాయని అన్నారు. కల్తీ విత్తనాలపై, విత్తన ధర నిర్ణయంలోనూ సమర్థవంతంగా పని చేసినట్లు గుర్తుచేశారు. అయితే 2014 నుండి 2023 వరకు పదేళ్ల కాలంలో కంపెనీల అధిపత్యం నడిచిందని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. ముఖ్యంగా బహుళ జాతి సంస్థలు విచ్చలవిడిగా రైతుల చేత విత్తనోత్పత్తి చేయించి రైతులను ఆర్థికంగా దెబ్బతీశాయని విమర్శించారు.
త్వరలో ప్రభుత్వానికి నివేదిక
రైతులను మోసం చేసి కంపెనీలు కోట్ల రూపాయలు సంపాదించాయన్న రైతు కమీషన్ ఛైర్మన్.. ఇందుకు ములుగు జిల్లానే ఉదాహరణ అని పేర్కొన్నారు. ములుగులో జరిగిన సంఘటనలు తెలిసిన వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు కోదండ రెడ్డి గుర్తుచేశారు. కమిటీ సమగ్ర నివేదిక వచ్చిన వెంటనే కలెక్టరేట్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. బాధిత రైతులు, కంపెనీ గుప్పిట్లో ఉన్న ఆర్గనైజర్లు, అన్ని శాఖల అధికారులు, ఐటీడీఏతో చర్చించి దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రైతు సంక్షేమ కమీషన్ ఛైర్మన్ స్పష్టం చేశారు.
Also Read: Saweety Boora: పోలీసు స్టేషన్ లో వాగ్వాదం.. భర్తపై దాడి చేసిన ప్రముఖ మహిళా బాక్సర్
ఆత్మహత్యలపై ఆరా
బహుళ కంపెనీల ఉచ్చులో పడి ఆత్మహత్య చేసుకున్న రైతుల గురించి సైతం కమీషన్ తాజా మీటింగ్ లో ఆరా తీసింది. ఈ సందర్భంగా వడ్డీ వ్యాపారులు, కంపెనీల ప్రతినిధులు రైతులను ఏవిధంగా మోసం చేస్తున్నారో ఈ సమావేశంలో మరోమారు బట్టబయలైంది. దీనిపై స్పందించిన రైతు కమీషన్ ఛైర్మన్.. త్వరలోనే ఈ సమస్యల పరిష్కారానికి నిపుణులతో చర్చిస్తామని అన్నారు. మేధావులతో చర్చించి ములుగు జిల్లా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన చెప్పారు.
రైతన్నల హర్షం
గత కొంతకాలంగా తమను వేధిస్తున్న సమస్యకు ‘స్వేచ్ఛ’ వరుస కథనాలతో పరిష్కారం దొరుకుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బహుళ కంపెనీల మోసాల నుంచి తమను రక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపై ఇలాంటి మోసాలు జరగకుండా అధికారులు అండగా నిలవాలని కోరుకుంటున్నారు.