Araku Coffee: ఏపీ అరకుకు అరుదైన గౌరవం లభించింది. గిరిజన రైతుల శ్రమను గుర్తించిన సీఎం చంద్రబాబు అరకు కాఫీని జాతీయస్థాయిలో ప్రమోట్ చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. కేంద్రంతో మాట్లాడి ప్రధానిని, లోక్ సభ స్పీకర్ ను ఒప్పించి పార్లమెంట్ ఆవరణలో ప్రతినిధులకు అరకు కాఫీ రుచి చూసే సౌకర్యం కల్పించారు. లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ క్యాంటీన్‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.
కాఫీ ప్రాముఖ్యతను పెంచే దిశగా..
అరకు కాఫీ గురించి గతంలో ప్రధాని మోదీ సైతం ప్రస్తావించారు. అరకు కాఫీ ప్రాముఖ్యతను మరింత పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఈ ప్రత్యేకమైన కాఫీకి గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా, పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని టీడీపీ ఎంపీలు గతంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. వారు అనుమతించడంతో అరకు కాఫీ ఘుమఘుమలు హస్తినకు చేరాయి.
అరకు నుంచి హస్తినకు..
ఈ సందర్భంగా గిరిజన ఉత్పత్తులకు మద్దతుగా నిలిచి పార్లమెంట్లో అరకు కాఫీని ప్రారంభించిన పీయూష్ గోయల్, జువాల్ ఓరాం, కిరణ్ రిజిజు కృతజ్ఞతలు. సహకరించిన లోకసభ స్పీకర్ ఓం బిర్లా కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పోస్ట్ చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం కావడం గర్వకారణం.
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ నుంచి GI ట్యాగ్ పొందిన ఈ ఆర్గానిక్ కాఫీ కేవలం ఒక పానీయమే మాత్రమే కాదు. ఇది 1.5 లక్షల గిరిజన రైతుల శ్రమకు దక్కిన ఫలితం, ఎన్నో ఏళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న గిరిజన రైతుల కృషి నేడు అరకు కాఫీని జాతీయ వేదికపై నిలిపింది. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో, అరకు కాఫీ లాంటి GI ఉత్పత్తులు గుర్తింపు పొందుతున్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాల సాధికారతకు తోడ్పాటును అందించడమే గాక భారతదేశ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తోంది.
Also Read: Bengaluru Students: మాస్టర్ వచ్చారు.. అంతలో ఘర్షణ.. అసలేం జరిగిందంటే?
పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా అరకు ప్రాంత రైతులకు గొప్ప అవకాశంగా మారనుంది. టీడీపీ ఎంపీల విజ్ఞప్తితో తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్తులో మరింత మందికి అరకు కాఫీ ప్రాముఖ్యతను తెలియజేయబోతోంది. ఇది కేవలం కాఫీ ప్రచారమే కాదు, రైతుల జీవనోపాధిని మెరుగుపరచే మరో అడుగని చెప్పొచ్చు.