BJP: తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడు(State President) ఎవరు అన్న దానిపై ఇంకా సస్పెన్స్(Suspense) వీడటం లేదు. పదవి ఎవరికి దక్కుతుందనేది రాష్ట్ర నాయకులకే అంతుచిక్కడంలేదు. ఈటల రాజేందర్(Etela Rajender)కే ఖాయమైందంటూ ఆయన వర్గీయులతో పాటు పలువురు ఇప్పటివరకూ వ్యాఖ్యానించారు. కానీ మరోసారి బండి సంజయ్ పేరు తెర మీదకు వచ్చింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందన్నది పార్టీ కేంద్ర వర్గాల సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు బీజేపీ అభ్యర్థుల గెలుపు వెనక బండి సంజయ్(Bandi Sanjay) పాత్ర కీలకంగా మారిందని, ఆ జిల్లాలో పోలైన ఓట్లే నిర్ణయాత్మకమయ్యాయనేది హైకమాండ్ అభిప్రాయం. ఈ ఏడాది చివరకు జరగాల్సిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే తరహా విజయం రిపీట్ కావాలని భావిస్తున్నది. దీనికి తోడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆయననే స్టేట్ చీఫ్‌గా కొనసాగిస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమనే ధీమా కేంద్ర నాయకత్వంలో వ్యక్తమైంది.
సంజయ్ వైపే మొగ్గు
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని బలమైన వ్యక్తికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం అవసరమనే అభిప్రాయంతో బండి సంజయ్ పేరును సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా ఆయనకే మొగ్గు చూపడంతో వీలైనంత తొందరగా పేరును లాంఛనంగా ప్రకటించాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నది. ఈటల రాజేందర్ కు ప్రత్యామ్నాయంగా ఇతర బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయి. కేంద్ర నాయకత్వం ఎలా ఆలోచిస్తున్నదీ రాష్ట్ర నాయకులకు అంతుబట్టడంలేదు. స్టేట్ చీఫ్‌గా ఎవరిని నియమించినా పార్టీ క్రమశిక్షణ ప్రకారం ఆమోదించక తప్పదనే సాధారణ సూత్రం ఉన్నప్పటికీ ఆయా వర్గాల నుంచి సహకారం అందకపోవచ్చనే ఆందోళన కూడా ఉన్నది. సంస్థాగతంగా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడం అవసరమని భావిస్తున్న జాతీయ నాయకత్వం స్టేట్ చీఫ్ నియామకం విషయంలో ఆచితూచి అడుగేస్తున్నది.
Sanjay on KCR: కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు.. పెద్ద బాంబే పేల్చారు
వీలైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించాలని భావిస్తున్నందున ఎవరి పేరు ఖరారవుతుందనే ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తేనే రాష్ట్రంలో పార్టీ బలపేతమవుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇద్దరి గెలుపుతో మొదలైన పార్టీ విజయ ప్రస్థానం అసెంబ్లీ ఎన్నికల దాకా కంటిన్యూ చేయాలంటే సమర్ధుడైన, అన్ని వర్గాలను కలుపుకుపోగలిగిన వ్యక్తిని స్టేట్ చీఫ్‌గా నియమించాలనే చర్చలు మొదలయ్యాయి. గతంలో బండి సంజయ్ స్టేట్ చీఫ్‌గా ఉన్న సమయంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీని ఢీకొనేలా ఎక్కువ సీట్లు గెల్చుకున్నామని, ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం కావాలన్నది పార్టీ అధిష్టానం ఆలోచన. కేవలం నాలుగు సీట్ల బలాన్ని బీజేపీ 48 సీట్లకు పెంచుకోగలిగింది. బీఆర్ఎస్ 43 చోట్ల ఓడిపోతే బీజేపీ 44 చోట్ల అదనంగా గెల్చుకున్నది. ఈ మొత్తం పరిణామాలను గమనంలోకి తీసుకునే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలతో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్నది.
ఈటల రాజేందర్‌ను స్టేట్ చీఫ్‌గా నియమిస్తున్నట్లు లీకులు ఇచ్చిన తర్వాత పార్టీలో వివిధ స్థాయిల్లోని లీడర్లు, కేడర్ పల్స్ ను గమనంలో ఉంచుకుని మార్పుపై సమాలోచనలు చేసినట్లు తెలిసింది. ఈటల నియామకంతో కొన్ని వర్గాలు, గ్రూపుల నుంచి మద్దతు రాకపోవచ్చని, గతంలో బండి సంజయ్ చీఫ్‌గా ఉన్నప్పటి పరిస్థితికి చేరుకోవడంపైనా లోతుగా చర్చలు జరిగినట్లు తెలిసింది. కీలకమైన దశలో ప్రయోగాలు చేయడంకంటే పార్టీ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని వ్యవహరించడం ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్ తాజా పరిస్థితిని, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలన్నీ బీజేపీ స్టేట్ చీఫ్ నియామకం విషయంలో నిర్ణయం తీసుకోడానికి కారణాలవుతున్నాయి. గతంలో ఆర్టీసీ సమ్మె మొదలు అనేక విషయాల్లో బండి సంజయ్ నాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి మైలేజ్ తీసుకొచ్చిందని, సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయనను తొలగించిన తర్వాతి పరిస్థితులనూ విశ్లేషించినట్లు తెలిసింది.
ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగే సంగతి ఎలా ఉన్నా, ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే అనుమానాలు ఉన్నా కొత్త చీఫ్‌గా ఎవరి పేరు ఖరారవుతుందనేది రాష్ట్ర నేతల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నది. రేసులో తాను లేనంటూ స్వయంగా బండి సంజయ్ చెప్పినా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అధికారికంగా ప్రకటించేంత వరకు సస్పెన్స్, కన్‌ఫ్యూజన్ కొనసాగనున్నది.