CPI Narayana: సీపీఐ నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వార్తలలో నిలుస్తూనే ఉంటారు. ఆయన లేవనెత్తిన అంశాలు పరిష్కారం అవుతాయో? లేదో? తెలియదు కానీ, ఎలాగోలా కొన్ని రోజులు ఆయన పేరు మీడియాలో వినబడేలా అయితే చూసుకుంటూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతి విషయంలో దూకుడుగా ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకునేందుకు.. సమాజంపై ప్రేమను ఒలకబోసేలా సీపీఐ నారాయణ మైకుల ముందుకు వస్తుంటారు. ఇప్పుడాయనకు బెట్టింగ్ యాప్స్ రూపంలో ఓ ఆయుధం దొరికింది.
కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూస్తూనే ఉన్నాం. పాత వీడియోలు వెతికి మరీ కేసు ఫైల్ చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారో తెలియదు కానీ, విచారణకు పిలిచి మరీ, ఎవరు మీకు ఈ యాప్స్ గురించి చెబుతున్నారు? ఎవరు మిమ్మల్ని ప్రమోట్ చేయమంటున్నారు? అంటూ విచారణకు వచ్చిన వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతానికి బెట్టింగ్ యాప్స్ రూపంలో.. మిగతా విషయాలన్నీ అటకెక్కాయి. మరో విషయమే లేదన్నట్టు.. ఇదే ప్రస్తుతం పరిష్కరించాల్సిన సమస్య అన్నట్లుగా పరిస్థితులను మార్చేస్తున్నారు. ఫైనల్‌గా ఏం తేలుస్తారో తెలియదు కానీ, ప్రస్తుతానికైతే ఇదే హాట్ టాపిక్. ఇప్పుడిదే టాపిక్‌తో వార్తలలోకి వచ్చారు సీపీఐ నారాయణ.
Also Read- Megastar Chiranjeevi: మాటలు సరిపోవు.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది
సీపీఐ నారాయణలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే.. జరుగుతున్న టాపిక్ గురించి మాట్లాడేది తక్కువ.. చెప్పుకునే గొప్పలు ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే విధానం చూస్తుంటే. ఇప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి క్లాస్ ఇచ్చింది తక్కువ.. ఆయన ఇంతకు ముందు ఏం చేశారో చెప్పుకుంది ఎక్కువ అన్నట్లుగా.. నారాయణ మాట్లాడిన తీరు ఉంది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే..
‘‘కళామతల్లి ఇచ్చే గుర్తింపును బెట్టింగ్ యాప్స్ వంటి తప్పుడు పనులకు దుర్వినియోగం చేయవద్దు. సినీ నటులను ప్రజలు అనుసరిస్తూ ఉంటారు. గుట్కా విషయంలో ఒక పనికిమాలిన తీర్పు వచ్చింది. దానిని ఆసరాగా చేసుకుని ‘పాన్ పరాగ్’ పేరుతో అనైతిక వ్యాపారం చేస్తున్నారు. సినీ నటులు చేతి నిండా సంపాదిస్తున్నారు. సినిమాలు కాకపోతే వారికి ఓటీటీ సహా ఎన్నో రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్.. ఈ పాడు సంపాదన దేనికి?
గతంలో కోకో కోలా కంపెనీ కోసం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రకటనలు ఇచ్చేవారు. అప్పుడు ఆయనకు నేను ఒక లేఖ రాశాను. ఓవైపు రక్తదానం చేస్తూ, చేయిస్తూ.. మరో వైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించాను. అంతే, ఆయన కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ప్రకటనలు చేయనని చెప్పారు. మళ్లీ ఆయన వాటి జోలికి వెళ్లలేదు. అలాంటి ఆయనే వాటన్నింటికీ దూరంగా ఉంటే.. మీరెంత? ఎందుకు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారు. ఇకనైనా మారండి’’ అంటూ చెప్పుకొచ్చారు.
Also Read- Prakash Raj: పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి నాకు ఎటువంటి నోటీసు రాలేదు.. వస్తే చెబుతా!
అయితే ఆయన చెప్పింది అంతా బాగానే ఉంది. కానీ మారడానికి, అందరూ మెగాస్టార్‌లా ఉండరు కదా. కొన్నాళ్లుగా ‘బిగ్ బాస్’ రియాలిటీ షో పై నారాయణ ఫైట్ చేస్తున్నారు. ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు కూడా.. ఏదో ఒక మాట అన్నాం.. మనం స్పందించాం, అయిపోయింది అని కూర్చోకుండా, నారాయణ వంటివారు జనంలోకి వచ్చి ఫైట్ చేయాలి. వారి పార్టీ భావజాలం కూడా అదే. కానీ అది ఎప్పటికీ జరగదు. మైక్ ముందు ఒక మాట మాట్లాడామా? అయిపోయిందా? అంతే. ముందు మార్పు మనలో రావాలి, నారాయణగారూ అంటూ కొందరు నెటిజన్లు ఆయన వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు