తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ :TG Govt: రాష్ట్ర ఎకానమీలో పరిశ్రమలతో పాటు భవన నిర్మాణ రంగం క్రియాశీలకమైనదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర స్థూల అదనపు విలువ (గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్)లో ఉత్పత్తి (మాన్యుఫ్యాక్చరింగ్) రంగం వాటా 47.60% ఉంటే ఆ తర్వాతి స్థానంలో ఉన్నది భవన నిర్మాణ రంగానిదే (29.07%) అని లెక్కలతో సహా తేల్చింది. ఉపాధి కల్పనలోనూ పరిశ్రమల తర్వాతి స్థానం కన్‌స్ట్రక్షన్ రంగానిదేనని స్పష్టత ఇచ్చింది.
పరిశ్రమలు ఎక్కువగా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైనా కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీ మాత్రం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నదని, అందువల్ల అక్కడ ఉపాధి కల్పన గణనీయంగా ఉన్నదని పేర్కొన్నారు. అసెంబ్లీలో విడుదల చేసిన సోషియో ఎకనమిక్ సర్వే నివేదికలో గణాంకాలతో సహా పలు వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఉత్పత్తి రంగం రాష్ట్ర ఎకానమీకి 1.31 లక్షల కోట్లను అందిస్తే కన్‌స్ట్రక్షన్ రంగం దాదాపు రూ. 80,613 కోట్లను అందిస్తున్నట్లు వివరించింది.
రాష్ట్రంలోని మొత్తం కార్మికుల్లో ఉత్పత్తి రంగంలో దాదాపు 56.40% మంది పనిచేస్తూ ఉంటే 41.10% మంది భవన నిర్మాణ రంగంలోనే ఉన్నట్లు వివరించింది. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులు 43.59% ఉంటే పట్టణాల్లో కేవలం 37.78% ఉన్నట్లు పేర్కొన్నది. లేబర్ ఫోర్స్ పీరియాడికల్ సర్వే (2023-24) నివేదికలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయని ప్రభుత్వం ఉదహరించింది.
Also read:Congress Govt: 15 నెలలు.. లక్ష కొలువులు.. లేబర్ సర్వే తేల్చిన అసలు నిజమిదే..
ఈ రంగాల వృద్ధిరేటును విశ్లేషిస్తూ, ఉత్పత్తి రంగం గతేడాది (2023-24) 5.18% వృద్ధి రేటు సాధిస్తే కన్‌స్ట్రక్షన్ రంగం మాత్రం రెట్టింపు దాటి 11.97% వృద్ధి రేటును నమోదు చేసినట్లు తెలిపింది. ఒకవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్కడి స్థానికులకు పరిమితంగా ఉపాధి కల్పిస్తూ ఉంటే భవన నిర్మాణ రంగం మాత్రం సంవత్సరం పొడవునా పని కల్పించడం గమనార్హం. కరోనా కారణంగా భవన నిర్మాణ రంగం కొంత వెనకబడినా ఆ తర్వాత యధాతథ స్థితికి చేరుకున్నది.
ఎకానమీపరంగా చూస్తే భవన నిర్మాణ రంగం వాటా 29.07%గా ఉన్నప్పటికీ ఉపాధి కల్పనలో మాత్రం 41.10% ఉన్నట్లు లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా తేలింది. ఉత్పత్తి రంగం అటు ఎకానమీలో 47.60%, ఉపాధి కల్పనలో 56.40% ఉన్నందున ఎక్కువ మంది కార్మికులకు పని కల్పించేదిగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. భవిష్యత్తులో అక్కడ పరిశ్రమలను కూడా స్థాపించే దిశగా ఆలోచిస్తున్నది.
స్థానికంగా పండుతున్న పంటలకు అనుగుణంగా ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పాలని భావిస్తున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమర్పించిన వార్షిక బడ్జెట్‌లోసైతం ‘మెగా మాస్టర్ ప్లాన్ – 2050’ గురించి వివరించారు. పారిశ్రామిక ప్రగతికి ప్రస్తుతం హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నదని, పరిశ్రమలన్నీ నగరం చుట్టూ కేంద్రీకృతమయ్యాయని, ఇకపైన వికేంద్రీకరణతో రాష్ట్రం మొత్తానికి విస్తరింపజేయనున్నట్లు తెలిపారు.
ఐటీ, ఫార్మా, హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, గార్మెంట్స్, మెటల్‌వేర్, చేనేత, ఆభరణాల తయారీ తదితర క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని, పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ నగరాన్ని విద్య, వైద్య, ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసి నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పుతామని, తయారీ (మాన్యుఫ్యాక్చరింగ్) రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
Also read: Swetcha Effect: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. మెట్రో రైళ్లపై ఇప్పుడే తొలగిస్తాం.. మెట్రో ఎండీ
ఈ నిర్ణయాలతో ఒకవైపు స్థానికంగా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన సాధ్యమవుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం భవన నిర్మాణ రంగం ఉపాధి కల్పిస్తున్నందున భవిష్యత్తులో పరిశ్రమల స్థాపనతో ఆ రంగం ద్వారానూ పని దొరికేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.