తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Betting Apps- బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో నిందితులుగా ఉన్న బుల్లితెర స్టార్స్ విష్ణుప్రియ, రీతూ చౌదరి.. గురువారం విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇద్దరినీ దర్యాప్తు అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఏయే యాప్‌లను.. ఏయే సోషల్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా ప్రమోట్ చేశారు? ఎంతెంత డబ్బు తీసుకున్నారు? లావాదేవీలు ఎలా జరిగాయి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయాలంటూ ఎవరు అడిగారు? వాళ్ల పేర్లు, ఇతర వివరాల గురించి కూడా ఆరా తీశారు. ఈ క్రమంలో ఇద్దరి మొబైల్ ఫోన్లను సీజ్ చేయటంతోపాటు, వారి బ్యాంక్ ఖాతాల వివరాలను తీసుకున్నారు.
Also Read- Megastar Chiranjeevi: మాటలు సరిపోవు.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది
వినయ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఇటీవల 11 మంది బుల్లితెర నటులు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణ నిమిత్తం కేసులో నిందితులుగా ఉన్న విష్ణుప్రియ, టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్ తదితరులకు మంగళవారం విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి టేస్టీ తేజ పోలీసుల ఎదుట హాజరై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బుధవారం కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణకు వచ్చారు. తాను నేరుగా ఎలాంటి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయలేదంటూ విచారణాధికారులకు తెలిపాడు. ఇమ్రాన్ చేసిన కొన్ని ప్రమోషన్లలో అతనితో కలిసి ఉన్నానని చెప్పాడు.
ఉదయం 10 గంటలకు…
కాగా, గురువారం ఉదయం 10 గంటలకు విష్ణుప్రియ తన అడ్వకేట్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. పోలీసుల ప్రశ్నలకు జవాబులు ఇస్తూ తాను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.తాజ్777బుక్.కామ్ అన్న బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేయటం కోసం 15 వీడియోలు చేసినట్టుగా ఆమె వెల్లడించినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ఆ యాప్‌ను ప్రమోట్ చేయమంటూ ఆ వెబ్‌సైట్ తరపున ఎవరు కలిశారు? ఎన్ని సంవత్సరాలకు అగ్రిమెంట్ చేశారు? ప్రమోట్ చేసినందుకు ఎంత డబ్బు ఇచ్చారు? బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చెల్లింపులు జరిపారా? ఇతర పద్దతిలో ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఒక సంవత్సరం మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా విష్ణుప్రియ చెప్పినట్టుగా తెలిసింది. అప్పట్లో బెట్టింగ్ యాప్ ద్వారా తనను కలిసింది ఎవరన్నది ప్రస్తుతం గుర్తులేదని వెల్లడించినట్టు సమాచారం. తాను చేసిన ప్రమోషన్ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశానని విష్ణుప్రియ చెప్పినట్టుగా తెలిసింది. యాప్‌ను ప్రమోట్ చేసినందుకు నగదును బ్యాంకు ద్వారానే ఇచ్చినట్టుగా చెప్పినట్టు తెలియవచ్చింది. నెల నెలా మొత్తాన్ని అకౌంట్లలో జమ చేసేవారని తెలియచేసినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు విష్ణుప్రియకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలను ఆమె నుంచి సేకరించారు. ఏయే బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయన్న వివరాలను కూడా తీసుకున్నారు. విష్ణుప్రియ మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు.
Also Read- Prakash Raj: పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి నాకు ఎటువంటి నోటీసు రాలేదు.. వస్తే చెబుతా!
మధ్యాహ్నం 3 గంటలకు…
ఇదిలా ఉండగా మధ్యాహ్నం 3గంటల సమయంలో రీతూ చౌదరి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఎవ్వరితో మాట్లాడకుండా నేరుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లిపోయింది. విష్ణుప్రియకు సంధించిన ప్రశ్నలనే రీతూ చౌదరిని కూడా అడిగినట్టు సమాచారం. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయటం చట్టరీత్యా నేరమన్న విషయం తనకు తెలియదని రీతూ చౌదరి పోలీసులతో అన్నట్టుగా తెలియవచ్చింది. కేసులు నమోదైన తరువాత ఆ విషయం తెలిసిందని చెప్పినట్టు సమాచారం. ఆ వెంటనే తెలియక బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశానని.. తనను క్షమించాలని కోరుతూ వీడియో చేసి తన సోషల్ అకౌంట్లలో పోస్ట్ చేసినట్టుగా చెప్పిందని తెలిసింది. దాంతోపాటు బెట్టింగ్ యాప్‌లలో ఎవ్వరూ డబ్బులు పెట్టవద్దని కోరినట్టు చెప్పిందని సమాచారం. రీతూ చౌదరి వేర్వేరు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన నేపథ్యంలో పోలీసులు ఆయా యాప్‌ల వివరాలను సేకరించినట్టు తెలిసింది. ఆయా యాప్‌ల నుంచి ఎవరు సంప్రదించారు? అన్న ప్రశ్నకు మాత్రం రీతూ చౌదరి నుంచి స్పష్టమైన జవాబు రాలేదని సమాచారం. అయితే, యాప్‌లను ప్రమోట్ చేసినందుకు యాప్‌ల నిర్వాహకులు నెల నెలా డబ్బు ఇచ్చినట్టుగా ఆమె చెప్పినట్లుగా తెలిసింది.
వీళ్లు రావాల్సి ఉంది…
ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, యాంకర్ శ్యామల, బండారు శేశయని సుప్రిత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ లు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరిలో ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దేశం విడిచి పరారైనట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు దుబాయ్ లేదా బ్యాంకాక్ పోయినట్టుగా అనుమానిస్తున్నారు. ఇక, నోటీసులు అందుకున్న యాంకర్ శ్యామల తాను షూటింగులో ఉన్నందున గడువు కావాలని అడిగినట్టు సమాచారం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు