KCR – KTR: పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party).. ప్రస్తుతం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులకు గాను ఆ పార్టీ ముఖ్యనేతలను కేసులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక నేతలు సైతం పార్టీని వీడుతున్నారు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన పార్టీ అధినాయకుడు కేసీఆర్ (KCR).. బయట ఎక్కడా కనిపించకపోవడంతో నేతలతో పాటు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎంతో కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు సైతం కేసీఆర్ రాకపోవడంపై సొంత క్యాడర్ లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ జిల్లాల పర్యటన (KTR Disricts Tour))కు సిద్ధం కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
కేటీఆర్ పర్యటన షెడ్యూల్
మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం (మార్చి 20) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సూర్యపేటకు వెళ్లనున్న కేటీఆర్.. అక్కడ దాదాపు 10వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం అవుతారు. అనంతరం ఈ నెల 23న కరీంనగర్ లో పర్యటించి అక్కడ ముఖ్య కార్యకర్తలతో ఆయన భేటి కానున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో అవి పూర్తైన అనంతరం మిగిలిన అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు కేటీఆర్ వ్యూహా రచన చేస్తున్నారు.
సిల్వర్ జూబ్లీ కోసం సన్నద్ధత
బీఆర్ఎస్ స్థాపించి 25 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వరంగల్ లో సిల్వర్ జూబ్లీ వేడుకలు (BRS Silver Jubilee Celebrations) నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో కేటీఆర్ జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు కేటీఆర్ జిల్లాల బాట పట్టారు. ఆయా జిల్లా కేంద్రాల నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేలా కీలక సూచనలు చేయనున్నారు.
Also Read: Banglore News: రోజూ రూ.5000 ఇస్తేనే కాపురానికి సై.. లేదంటే నై నై
పునరుత్తేజం రగిలేనా?
గత కొద్దిరోజులు జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తిగా నిరాశ, నిస్పృహలో ఉన్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓటమితో పాటు.. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ తో పాటు.. శ్రేణుల్లోనూ గందర గోళం నెలకొంది. దానికి తోడు పార్టీ అధినాయకుడు కేసీఆర్.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఇది బీఆర్ఎస్ క్యాడర్ లో మరింత అసంతృప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన కేటీఆర్.. జిల్లాల పర్యటన ద్వారా వారిలో పునరుత్తేజం నింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 14ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనతో తెలంగాణ ప్రజలతో పెనవేసుకున్న అనుబంధాన్ని గుర్తుచేయాలని భావిస్తున్నారట. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైన పార్టీకి అండగా ఉన్నవారికి రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ భరోసా ఇవ్వనున్నారు.