తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Social Media Influencers: కలకలం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్ ల వ్యవహారంలో అసలు సూత్రధారులు దొరికేనా?…ఈ ప్రశ్నకు సైబర్ నిపుణులు అంత సులభం కాదని సమాధానం ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన యూ ట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లను అరెస్ట్ చేసినా వాటిని నడిపిస్తున్న వారిని కటకటాల వెనక్కి పంపించటం కష్టసాధ్యమని చెబుతున్నారు. పకడ్భంధీగా రూపొందించుకున్న పథకం ప్రకారం వ్యవస్థీకృతంగా నిర్వాహకులు ఈ యాప్ లను నడిపిస్తుండటమే దీనికి కారణమని అంటున్నారు.
బెట్టింగ్ యాప్ లు ఈ రోజు కొత్తవేమీ కాదు. కొన్నేళ్ళ నుంచి నడుస్తున్నవే. అయితే, కోవిడ్ సమయంలో లాక్ డౌన్ విధించినపుడు ఈ యాప్ లలోకి వెళ్లి బెట్టింగులు ఆడేవారి సంఖ్య ఊహించని వేగంతో పెరుగుతూ వచ్చింది. ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయిన చాలామంది వేర్వేరు బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్లలో తమ వివరాలను రిజిష్టర్ చేసుకుని జూదం ఆడుతూ వచ్చారు.
ఈ పరిస్థితిని ఆయా యాప్ ల నిర్వాహకులు తెలివిగా ఉపయోగించుకున్నారు. ఎవరైనా కొత్తగా తమ యాప్ లేదా వెబ్ సైట్ లో రిజిష్టర్ అయితే మొదట మూడు నాలుగుసార్లు బెట్టింగులో మీరు గెలిచారంటూ వందకు వంద…వెయ్యికి వెయ్యి లాభాలిచ్చి జూదరుల నమ్మకాన్ని సంపాదించుకున్నారు. దాంతో డబ్బు వస్తోంది కదా అన్న ఆశతో బెట్టింగులు చేసిన వారు మళ్లీ మళ్లీ డబ్బు కాస్తూ పోయారు. ఇలా అవతలివారు పూర్తిగా తమ ఉచ్ఛులో చిక్కారన్న విషయాన్ని గ్రహించిన తరువాత యాప్ ల నిర్వాహకులు వారి డబ్బును కొల్లగొట్టటం మొదలు పెట్టారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం ఇక్కడ https://epaper.swetchadaily.com/ క్లిక్ చేయండి
ఇలా వందలు…వేలు కాదు లక్షల్లో జనం డబ్బును లూటీ చేశారు. దీనికి నిదర్శనంగా రంగారెడ్డి జిల్లా షాబాద్ వాస్తవ్యుడైన హర్షవర్ధన్ రెడ్డి ఉదంతాన్ని పేర్కొనవచ్చు. హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి చెందిన భూమిని అభివృద్ధి పనుల కోసం 2022లో ప్రభుత్వం తీసుకుంది. పరిహారంగా 1.2 కోట్ల రూపాయలను అందచేసింది. ఈ డబ్బును హర్షవర్ధన్ రెడ్డి చేతికి ఇచ్చిన కుటుంబ సభ్యలు అతని తల్లి అకౌంట్ లో జమ చేయమన్నారు.
అప్పటికే బెట్టింగులకు అలవాటు పడి ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ఈ మొత్తంలో నుంచి 92లక్షల రూపాయలను ఆన్ లైన్ జూదం ఆడి పోగొట్టుకున్నాడు. ఆ తరువాత ఇంట్లో వాళ్లకు ఏం చెప్పాలో అర్థంగాక ఆత్మహత్య చేసుకున్నాడు. గడిచిన అయిదారేళ్లలో ఇలాంటి విషాదాలు పదుల సంఖ్యలో జరిగాయి. జనం కష్టార్జితాన్ని కొల్లగొడుతుండటంతోపాటు పలువురు ప్రాణాలు తీసుకోవటానికి కారణమవుతున్న బెట్టింగ్ యాప్ ల నిర్వాహకులలో ఇప్పటివరకు ఒక్కరు కూడా అరెస్ట్ కాకపోవటం గమనార్హం. దీనిపై సైబర్ నిపుణులతో మాట్లాడగా పక్కా రూపొందించుకున్న పథకం ప్రకారం నిర్వాహకులు ఈ యాప్ లను నడిపిస్తుండటమే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు.
ఆయా యాప్ లలో బెట్టింగుల రూపంలో పెడుతున్న డబ్బు నేరుగా యాప్ నిర్వాహకుల అకౌంట్లలో జమ కాదని చెప్పారు. చిన్న చిన్న హోటల్లు, చిరు వ్యాపారులు చేసే వారు వీరికి కలెక్షన్ ఏజెంట్లుగా ఉంటారని తెలిపారు. మీ ఖాతాల్లో మా డబ్బుపడుతుంది…ఆ తరువాత మాకు బదిలీ చేయండి…మీకు కమీషన్ ఇస్తామని చెప్పి యాప్ నిర్వాహకులు వీరిని కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారన్నారు. ఇక, యాప్ లలో ఒకసారి ఇచ్చిన అకౌంట్ వివరాలు మరో నెలా…రెండు నెలల వరకు ఇవ్వరన్నారు. దాంతో పందెంగా పెట్టే డబ్బు ప్రతీసారి వేర్వేరు అకౌంట్లలో జమ అవుతుందని వివరించారు.
Also Read: Sunita Williams: చిరునవ్వు చెరగలేదు.. ధైర్యం వీడలేదు.. ఎట్టకేలకు భువిపైకి సునీతా విలియమ్స్..
చిరు వ్యాపారుల లావాదేవీలు పదుల సంఖ్యలో ఉంటాయి కాబట్టి వీళ్లు బెట్టింగ్ యాప్ నిర్వాహకుల తరపున డబ్బు తీసుకుంటున్నారా? లేదా? అన్నది నిర్ధారించటం కష్టసాధ్యమన్నారు. ఈ కారణం వల్లనే బెట్టింగ్ యాప్ ల నిర్వాహకులను అరెస్టులు చేయటం అంత సులభం కాదని వివరించారు. ఈ యాప్ లను ప్రమోట్ చేసిన యూ ట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లను అరెస్టు చేసినా అసలు సూత్రధారులు ఎవరన్నది కనుక్కోవటం కష్టమే అని వ్యాఖ్యానించారు.