Nara Lokesh: గవర్నమెంట్ ఆఫీసుల్లో పని ఉందంటే.. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగడం, గంటల కొద్దీ పడిగాపులు కాయడం, అధికారుల నిర్లక్ష్యపు సమాధానాలు, దరఖాస్తుల బుట్టదాఖళ్లు ఇవన్నీ కామన్. కానీ ఇక నుంచి అలాంటి కష్టాల నుంచి బిగ్ రిలీఫ్ దొరకనుంది. కార్యాలయాలకు వెళ్లకుండానే కావలసిన పని చేసుకోవచ్చు. ఇప్పట్నుంచి అది అరచేతిలో పని మాత్రమే. అదే మంత్రి లోకేశ్ మానస పుత్రిక వాట్సాప్ గవర్నెన్స్. మన మిత్ర.
వాట్సాప్ గవర్నెన్స్ పై శాసనసభలో జరిగిన లఘు చర్చలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ‘‘ఆఫీసులకు వెళితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని సామాన్య ప్రజలు అక్కడకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఆఫీసులకు వెళ్తే మెరుగైన సేవలు అందకపోగా, లేనిపోని సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. గతంలో ఎంపిపిగా బీసీ మహిళకు రిజర్వేషన్ వస్తే ఆమెకు కుల ధ్రువీకరణ పత్రం అందకుండా ఆనాటి ఎమ్మెల్యే అడ్డుపడి, పదవికి దూరం చేశారు. ఆరోజే వ్యవస్థలో మార్పు తీసుకురావాలని నేను సంకల్పించుకున్నాను, అక్కడ నుంచే నాకు వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన మొదలైంది’’ అని తెలిపారు. అందులో భాగంగానే మనమిత్ర ఏర్పాటు చేశామన్నారు.
ఈ ఏడాది జూన్ 30 నాటికి 500 రకాల ప్రభుత్వ సేవలను మనమిత్రలో వాట్సాప్ ద్వారా అందిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ‘‘1983కి వెళ్తే ఎన్టీఆర్ సీఎం అయిన వెంటనే పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసి పరిపాలనను ప్రజలముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబునాయుడు సింగపూర్ సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రేరణ పొంది ఈ-సేవ సర్వీసులను ఎలక్ట్రిసిటీ బిల్ తో ప్రారంభించి, అనేకరకాల సేవలకు విస్తరించారు.
తర్వాత అదే మీ సేవగా మారింది. ప్రజలవద్దకు పాలన, ప్రజలవద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని చంద్రబాబు పదేపదే చెప్పేవారు. స్టాన్ ఫోర్డ్ ఎంబిఎ ద్వారా టెక్నాలజీ తెలసుకున్నా, ప్రజాసమస్యలను నేరుగా పాదయాత్ర తెలుసుకున్నా. ఆనాడు గ్రామగ్రామాన ప్రజలను కలిసినపుడు ఆఫీసుల ముందు పడిగాపులు పడాల్సి వస్తోందని చెప్పారు. బటన్ నొక్కితే సినిమా టిక్కెట్లు, స్విగ్గీ ఫుడ్, నిత్యావసర వస్తువులు, ట్యాక్సీ వంటి అన్ని సేవలు ఇంటికి వస్తున్నపుడు ప్రభుత్వ సేవలు ఎందుకు రావడం లేదని ప్రజలు నన్ను ప్రశ్నించారు’’ అన్నారు.
పాలనలో కీలక సంస్కరణలకు మనమిత్రతో నాంది
‘‘ధనవంతులకు, పేదలకు తేడా లేకుండా నాణ్యమైన విద్య అందిస్తున్న తరహాలోనే ప్రభుత్వ సేవలు అందరికీ సమంగా అందించాల్సి ఉంది. ఇందుకోసం సుపరిపాలనపై చాలా అధ్యయనం చేశాను, విజిబుల్ గవర్నెన్స్ – ఇన్విజిబుల్ గవర్నమెంట్ నినాదం ద్వారా ప్రజల చేతిలో పరిపాలన ఉండాలన్నది నా ఆకాంక్ష. ప్రజల దైనందిన జీవితంలో అధికారులు, రాజకీయ నాయకుల అవసరం ఉండకూడదన్నదే నా లక్ష్యం. బేసిక్ సర్వీసెస్, వివిధరకాల సర్టిఫికెట్లను అధికారుల పాత్ర లేకుండా చేయాలనే ఆలోచనచేశాను. కొత్త యాప్ తో అవసరం లేకుండా అందరికీ అందుబాటులో ఉన్నవాట్సాప్ ద్వారా మనమిత్ర పేరుతో ప్రజలచేతిలోకి పాలన తెచ్చే లక్ష్యంతో సేవలు ప్రారంభించాం.
పౌరసేలకు గేమ్ ఛేంజర్ గా మనమిత్ర పేరుతో సేవలకు శ్రీకారం చుట్టాం. ప్రస్తుతం 200 సేవలను మనమిత్ర ద్వారా అందిస్తున్నాం. ఇతర దేశాల్లో విధానాలను తెలసుకున్నపుడు ఎస్తోనియాలో ఈ గవర్నెన్స్ చాలా ముందుకు తీసుకెళ్లారు. సింగపూర్ లో స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఎఐ పవర్ తో సేవలు అందిస్తున్నారు. యుఎఇ లాంటి దేశాలు వాట్సాప్ ఆధారిత సేవలు అందజేస్తున్నారు. గవర్నెన్స్ లో విప్లవాత్మక సంస్కరణల అమలులో వాట్సాప్ గవర్నెన్స్ కీలక పాత్ర వహిస్తుందని మేం బలంగా నమ్ముతున్నాం.’’ అని తెలిపారు.
300 రకాల సేవలు
రాబోయే రోజుల్లో వాయిస్ అనేబుల్ చేసి ఎఐని అనుసంధానంతో ఇంకా మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మనమిత్రకు సంబంధించి సెప్టెంబర్ 19, 2024న మెటాతో సమావేశమై, అక్టోబర్ 22, 2024న ఎంఓయు చేసుకున్నట్లు చెప్పారు. జనవరి 30, 2025కి 150 రకాల ప్రభుత్వ సేవలు (రెవిన్యూ సర్టిఫికెట్, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు, గ్రీవెన్స్ సేవలు వంటివి) మనమిత్ర ద్వారా ప్రారంభించామని గుర్తు చేశారు.
ఈనెలాఖరుకు 300రకాల ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తేబోతున్నట్లు తెలిపారు. నూతన విధానంలో వివిధ రకాల సర్టిఫికెట్లు ట్యాంపరింగ్ కు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్ అనేబుల్ సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. సెక్యూరిటీ పేపర్ పేరుతో పెద్దఎత్తున ప్రభుత్వ విభాగాల్లో డబ్బు ఖర్చవుతోంది. క్యూఆర్ కోడ్ అనేబుల్ తో ఆ డబ్బు ఆదా అవుతుందని, రాబోయే రోజుల్లో ఎఐ అనేబుల్ ద్వారా మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తామన్నారు.