Notices to Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డికి సీఐడీ నుంచి మళ్లి పిలుపొచ్చింది. కాకినాడ పోర్టు బదిలీ వ్యవహారంలో ఈనెల 12న ఆయన తొలిసారి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. ఈ కేసుతో తనకేమి సంబంధం లేదని రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారన్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి గురించి ఇతర వైసీపీ నేతల గురించి, మద్యం కుంభకోణం గురించి సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను సంచలనం సృష్టించాయి.
కేసు ఏంటంటే..
ఈ కేసు పెట్టింది కాకినాడ పోర్టు యజమాని కేవీ రావు. కేసు ఎంటంటే.. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ (), కాకినాడ సెజ్ ()లోని రూ.3,600 కోట్ల విలువైన వాటాలను తన వద్ద నుంచి బలవంతంగా లాగేసుకున్నారని కేవీ రావు వైసీపీ నేతలపై కేసు పెట్టారు. ఈ కేసులో ఏ2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఎందుకంటే, కాకినాడ పోర్టు షేర్లను అరబిందో సంస్థ దక్కించుకుంది. దాని యజమాని శరత్ చంద్రారెడ్డి.. విజయసాయిరెడ్డికి అల్లుడే. ఈ నేపథ్యంలోనే ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సీఐడీ సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల క్రితం విచారణకు హాజరైన ఆయనను సీఐడీ అధికారులు దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించారు.
ఆ సమయంలోనే ఆయన కీలక విషయాలు మీడియా ముఖంగా వెల్లడించారు. కాకినాడ పోర్టు షేర్ల బదిలీ వ్యవహారంలో కర్త,కర్మ, క్రియ వైసీపీ ఎంపీ వైవి రెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిదేనని తెలిపారు.ఈ వ్యవహారంలో తనకేమీ సంబంధ లేదని, మళ్లి విచారణకు పిలిచినా వస్తానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఐడీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని కోరింది. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సెన్సెషనల్ కామెంట్స్
తొలిసారి విచారణలో భాగంగానే సీఐడీ అధికారులు ఆయనను కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలసింది. అరబిందో కంపెనీ ఎండీ శరత్ చంద్రారెడ్డి తన అల్లుడి సోదరుడని, ఆ కంపెనీ వ్యవహారాల్లో
తాను ఎక్కువ జోక్యం చేసుకునే వాడిని కాదని తెలిపారు. శరత్ చంద్రారెడ్డికి కేవీ రావుకి మధ్య డీల్ కుదిర్చింది మాత్రం విక్రాంత్ రెడ్డినేనని చెప్పి కుండబద్దలుకొట్టారు.
కాగా, కొద్ది రోజుల క్రితమే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వైసీపీ పైన గానీ, అధినేత జగన్ పై గానీ ఎటువంటి ఆరోపణలు చేయలేదు. కానీ.. సీఐడీ విచారణ నిమిత్తం హాజరయినప్పడు మాత్రం సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీలో ఉన్న నాయకుల మాటలే ఆయన వింటారన్నారు. తాను వైసీపీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని, తన మనసు విరిగిపోయిందని వివరించారు. అలాగే మద్యం కుంభకోణం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డినేనని మరో బాంబు పేల్చారు. తదనంతర పరిణామంగా ఇటీవల మద్యం కుంభకోణానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది.
ఇదిలావుంటే.. ఓ వైపు వైసీపీ నేతల వరుస అరెస్టులు కొనసాగుతున్న వేళ సాయిరెడ్డికి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. గతంలోనే మరిన్ని విషయాలు మెల్లిగా బయటపెడతానని సాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఆయన అరెస్టు చేయనున్నారా అనే ప్రచారం జరుగుతోంది. ఆయన అప్రూవర్ గా మారతారా అన్న చర్చ కూడ మొదలైంది.