తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : CM Revanth Reddy – PM Modi: రాష్ట్ర అసెంబ్లీలో కులగణన బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం లభించడంతో పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలని కోరుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజా పరిణామాలను వివరిస్తూ ప్రధాని మోదీకి సోమవారం సాయంత్రం లేఖ రాశారు. రాష్ట్రం నుంచి అఖిలపక్ష బృందంగా వస్తున్నామని, ఈ విషయమై చర్చించేందుకు తగిన సమయం (అపాయింట్‌మెంట్) ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.
గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేలా రెండు వేర్వేరు బిల్లులను తెలంగాణ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆ లేఖలో ప్రస్తావించారు.
ఈ బిల్లులకు (గవర్నర్ ఆమోదం తర్వాత చట్టాలుగా మారనున్నాయి) కేంద్రం మద్ధతు అవసరమని, దీన్ని కోరేందుకే అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో సీఎం విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో ప్రస్తుతం 69% రిజర్వేషన్ అమలవుతున్న తరహాలోనే తెలంగాణలో 42% అమలయ్యేలా పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ చేయాలని సీఎం రేవంత్ కోరనున్నారు.
ఏయే పార్టీ తరపున ఎవరు వస్తే బాగుంటుందంటూ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ పార్టీల ప్రతినిధుల పేర్లనూ పరోక్షంగా ప్రస్తావించారు. బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ కూడా సహకారం అందించాలని కోరుతూ ఆల్ పార్టీ డెలిగేషన్‌లో ఆయన రావాలన్న సంకేతాన్ని ఇచ్చారు.
బీజేపీ తరఫున పాయల్ శంకర్ చొరవ తీసుకోవాలని, ఆయనకు ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలున్నాయని, అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మజ్లిస్ తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరు పేర్లను ప్రస్తావించారు.
వీరే కాక వివిధ పార్టీల నేతలను కూడా ఈ బృందంతో తీసుకెళ్తామన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకుని ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారయ్యేలా బీజేపీ శాసనసభా పక్ష నాయకుడైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రయత్నించాలని కోరారు.
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్‌గాంధీతో అఖిలపక్ష బృందం కలిసేందుకు టైమ్ ఫిక్స్ చేసే బాధ్యతను పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చేపట్టాలని కోరారు. లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించేలా రాహుల్‌గాంధీని ఈ భేటీలో కోరుతామని సీఎం వ్యాఖ్యానించారు.