12A Railway Colony: అల్లరి నరేష్‌కు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. కమెడియన్‌గా స్టార్ స్టేటస్‌ను అందుకున్న తర్వాత, వైవిధ్యభరితమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అల్లరి నరేష్, ఎఫర్ట్ అయితే పెడుతున్నాడు కానీ, ఆయనకు హిట్ మాత్రం అందని ద్రాక్షగానే మారుతుంది. ‘బచ్చల మల్లి’ సినిమాపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆ సినిమా కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. అయినా సరే.. తన వైవిధ్యభరిత కాన్సెఫ్ట్‌ల విషయంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్ర వివరాలతో పాటు, టైటిల్‌ను రివీల్ చేస్తూ.. స్పైన్ చిల్లింగ్ పేరుతో ఓ టీజర్ వదిలారు. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Mohan Babu: ‘కన్నప్ప’ మూడో పాట.. మహాదేవ శాస్త్రి పరిచయ గీతం ఎప్పుడంటే?
అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా.. ‘మా ఊరి పొలిమేర, మా ఊరి పొలిమేర 2’ చిత్రాలతో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు షోరన్నర్‌గా వ్యవహరిస్తున్న చిత్రానికి ‘12A రైల్వే కాలనీ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్‌తోనే చెప్పవచ్చు.. మళ్లీ అల్లరి నరేష్ చేస్తుంది వైవిధ్యమైన సినిమానే అని. నాని కాసరగడ్డ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక విడుదలైన ఈ స్పైన్ చిల్లింగ్ టీజర్ ఎలా ఉందంటే..
ఈ టీజర్ ‘12A రైల్వే కాలనీ’ సినిమా కథను గ్లింప్స్‌లా ప్రజెంట్ చేస్తుంది. ఇందులో అల్లరి నరేష్ ఒక కిటికీ దగ్గర నిలబడి, సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వైవా హర్ష వాయిస్ ఓవర్‌లో.. ‘మావా.. కొంతమందికి మాత్రమే ఆత్మలు ఎందుకు కనిపిస్తాయో?’ అనే ప్రశ్న అనంతరం స్క్రీన్‌పై కనిపించిన ఒక్కో పాత్ర, ఒక్కో ఫ్రేమ్ భయానకంగా ఉంది. ప్రాణాలతో బయట పోవుడు అవసరం లేదన్నా.. అంటూ అల్లరి నరేష్ చెప్పిన డైలాగ్‌తో ఇందులో అతని పాత్ర ఏంటో అర్థమవుతుంది.
టీజర్‌లో వింతైన, కలవరపెట్టే సంఘటనలు ఎక్జయిటింగ్‌గా ఉన్నాయి. ప్రతి పాత్ర కూడా అనుమానాస్పదంగా వుండటంతో పాటు, అల్లరి నరేష్ పాత్ర ఒకరిని షూట్ చేసి నవ్వడం ప్రేక్షకులను ఆ పాత్ర గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా అయితే వుంది. అల్లరి నరేష్ డిఫరెంట్ షేడ్స్‌తో మరోసారి ఆసక్తికరమైన పాత్రను పోషించగా, పోలిమేర’ సిరీస్ చిత్రాల నటి, డాక్టర్ కామాక్షి భాస్కర్ల ఇందులో హీరోయిన్‌గా నటించగా.. సాయి కుమార్, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి వంటి వారంతా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సమ్మర్‌లోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఈ టీజర్‌లో తెలియజేశారు. మొత్తంగా అయితే, అల్లరి నరేష్ ఈసారి జోనర్ మార్చి మరీ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడనేది మాత్రం ఈ టీజర్‌తో అర్థమవుతుంది. మరి ఆయన అనుకున్న హిట్ ఈ సినిమాతో వస్తుందో, లేదో తెలియాలంటే మాత్రం.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతం ఈ టీజర్ మాత్రం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు