Brahma Anandam OTT: బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. తాత మనవళ్లుగా వారిద్దరూ ఇందులో నటించారు. ఆర్‌విఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందు భారీగా అంచనాలను ఏర్పరచుకుంది. ఎందుకంటే, బ్రహ్మానందం (Brahmanandam) ఈ మధ్యకాలంలో ఫుల్ లెంత్ రోల్ చేసింది చాలా తక్కువ. చిన్న చిన్న పాత్రలలో మాత్రం కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే గెస్ట్ రోల్స్‌కే పరిమితమవుతున్నారు. కానీ, చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మీ ఇందులో ఫుల్ లెంత్ రోల్, అందులోనూ తన కుమారుడికే తాతగా నటిస్తుండటంతో సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్‌తో ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అనుకున్నంతగా అయితే సక్సెస్ కాలేదు.
Also Read- L2 Empuraan: మార్చి 27న ‘L2 ఎంపురాన్’ మొదటి ఆట ఎన్ని గంటలకు పడుతుందో తెలుసా?
సినిమా విడుదలకు ముందు నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్ వంటి వారంతా హాజరై టీమ్‌కు ఆశీస్సులు అందించారు. టీజర్, ట్రైలర్స్ కూడా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. బ్రహ్మీ తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham) చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేస్తున్న చిత్రం, వెన్నెల కిశోర్ హీరోగా చేయాలనుకున్న చిత్రం కావడం.. ఇలాంటి విశేషాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించకపోవడంతో.. టీమ్ అంతా నిరాశకులోనైంది. అయితే ఓటీటీ రూపంలో ఈ సినిమాను ప్రేక్షకుల చెంతకు చేర్చాలని టీమ్ అంతా భావిస్తోంది. ‘బ్రహ్మా ఆనందం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా వచ్చేసింది. అయితే ఇందులోనే ఓ ట్విస్ట్ దాగుంది. అదేంటంటే..
ఈ సినిమా మార్చి 20వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా.. సదరు ఓటీటీ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే అంతకంటే ముందే, అంటే మార్చి 19వ తేదీనే ఈ సినిమాను చూసేలా ఆహా ఓ వెసులుబాటు కల్పించింది. మ్యాటర్ ఏంటంటే.. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఈ సినిమా ఒకరోజు ముందే వీక్షించే అవకాశాన్ని సదరు ఓటీటీ కల్పించింది. మార్చి 20 నుంచి మాత్రం నార్మల్ సబ్‌స్క్రైబర్లు ఈ సినిమాను చూడగలరు. మరి అంత ఆనందం సొంతం చేసుకోవడానికి ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్‌గా మారితే.. ఈ సినిమాను ఒక రోజు ముందే చూసేయవచ్చన్నమాట. పెద్ద ఆఫరే ఇది అని అనుకుంటున్నారా? ఆహాతో అలాగే ఉంటది మరి.
Also Read- Ram Charan: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో.. ఆ శ్వాగ్‌కి ఫిదా కావాల్సిందే!
ఇక ‘బ్రహ్మా ఆనందం’ కథ విషయానికి వస్తే.. థియేటర్ ఆర్టిస్ట్ అయిన బ్రహ్మ (రాజా గౌతమ్)కు ఎప్పటికైనా తనొక పెద్దనటుడిని అని నిరూపించుకోవాలనే లక్ష్యం ఉంటుంది. అలాంటి ఆఫర్ ఒకటి తనకు వస్తుంది కానీ, అందుకు రూ. 6 లక్షలు కట్టాల్సి వస్తుంది. సరిగ్గా అప్పుడే తన తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) తన దగ్గర 6 ఎకరాల భూమి ఉందని చెప్పి, అది కావాలంటే అంటూ ఓ కండీషన్ పెడతాడు. ఆ కండీషన్ ఏంటి? ఆ పొలం బ్రహ్మ వశమైందా? అంత పొలం పెట్టుకుని, రామ్మూర్తి వృద్ధాశ్రమంలో ఎందుకు ఉంటాడు? చివరికి ఈ తాత, మనవళ్ల కథ ఏ తీరానికి చేరింది? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు