CM Revanth Reddy: భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే తాము వ్యవస్థలను నడుపుతున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం వాటిని అవమానించిందని పేర్కొన్నారు. 2022 బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించిందని గుర్తుచేశారు. మహిళా గవర్నర్ ను అవమానించేలా వ్యవహరించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం శాసన సభలో మాట్లాడారు.
బీఆర్ ఎస్ నాయకులనుద్దేశించి మాట్లాడిన సీఎం..మంత్రివర్గం ఆమోదం పొందిన అంశాలనే గవర్నర్ తమ ప్రసంగంలో వినిపించారని, సీనియర్లమని, పదేళ్లు మంత్రులుగా చేశామని చెప్పుకునేవాళ్లు గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టారని తెలిపారు. వాళ్లు వారి అజ్ఞానాన్నే తమ విజ్ఞానమని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎలక్షన్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రభుత్వంలో అమలు చేస్తున్నామని, వాటినే మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచామన్నారు.
అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఉండదని స్పష్టం చేశారు. పదేళ్లు పాలించినవారు మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారా? అని ప్రశ్నించారు. వాళ్లకు గవర్నర్ పై గౌరవం లేకనే మహిళను అవమానించారన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని.. మేం రాజ్యాంగబద్ధంగా వ్యవస్థను గౌరవిస్తున్నామని పునరుద్ఘాటించారు.
Also read: CM Revanth Reddy pic: బీఆర్ఎస్.. గతం మరచిపోతే ఎలా? రేవంత్ ను ఎండలో నిలబెట్టి మరీ..
కేసీఆర్ కు సవాల్
కృష్ణ జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అని సీఎం రేవంత్ విమర్శించారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని, కేసీఆర్ చర్చలో పాల్గొనాలన్నారు. ఆయనతో మాట్లాడి ఆయనను సభకు వచ్చేలా ఒప్పించాలని స్పీకర్ ప్రసాద్ ను కోరారు. సభకు వస్తే కృష్ణా జలాల విషయంలో సమాధానం చెప్పాల్సి వస్తుందనే మాజీ సీఎం అసెంబ్లీకి రావడం లేదని, కేసీఆర్ ఏ రోజైతే సభకు వస్తారో.. ఆ రోజు తాను కృష్ణా జలాలపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఆ చర్చలో తమ తప్పు ఏమైనా ఉందని నిరూపిస్తే.. నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులకు తాను క్షమాపణ చెబుతానని అన్నారు.
కమిషన్ లకు అమ్ముడుపోకుండా జూరాల నుండి కృష్ణా నీళ్లు తీసుకుంటే.. ఇప్పుడు ఏపీ మనముందు మోకరిల్లేదని తెలిపారు. రోజాగారి రొయ్యల పులుసు తిని నీళ్లను వదిలేసి రాయలసీమను రత్నాల సీమగా చేసిన ఘనత కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, హరీశ్‌రావు చంద్రబాబు ముందు మోకరిల్లి తద్వారా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు మరణంశాసనం రాశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ వాళ్లు స్ట్రెచర్ గురించి మాట్లాడుతున్నారని, వాళ్లకు స్టేట్ ఫ్యూచర్ అవసరం లేదని విమర్శించారు. కేసీఆర్ కుర్చీని నాలుగుకోట్ల మంది గుంజుకుని నాకు ఇచ్చారన్నారు. కేసీఆర్ ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే ఆయన ఎల్లవేళలా ప్రతిపక్షంలోనే ఉండి సూచనలు అందించాలని, తాను సీఎంగానే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.