తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Smart Ration Cards: ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘స్మార్ట్’ (స్కీమ్ ఫర్ మోడర్నైజేషన్ అండ్ రిఫామ్స్ త్రూ టెక్నాలజీ) పీడీఎస్ సిస్టమ్‌ను వినియోగంలోకి తెస్తున్నది. వచ్చే నెల నుంచి తమిళనాడు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది దశలవారీగా అమల్లోకి రానున్నది.
ఆధునిక సాఫ్ట్ వేర్‌ను వినియోగించి సప్లై చైన్ మెకానిజంను పటిష్టం చేయడంలో భాగంగా ఈ కొత్త స్కీమ్‌ను అమలు చేయనున్నట్లు కేంద్ర ఆహార పౌర సరఫరాల మంత్రిత్వశాఖ పేర్కొన్నది. అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, తమిళనాడు మాత్రం ఇంకా అంగీకారం తెలపలేదని, ప్రస్తుతం అది పురోగతిలో ఉన్నదని ఆ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
Also read: New Schemes In TG: సరికొత్త పథకాలతో.. తెలంగాణ సర్కార్ ప్లాన్.. అవేమిటంటే?
ఈ స్కీమ్ అమలుతో రాష్ట్రంలోని సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా చట్టం కింద అమలు చేస్తున్న పథకాలన్నీ వినియోగదారులకు లీకేజీకి ఆస్కారం లేకుండా అందుతాయని, నూతన సాఫ్ట్ వేర్‌ను వినియోగించడం ద్వారా ప్రస్తుత విధానాలను సంస్కరించడానికి వెసులుబాటు లభిస్తున్నదని వివరించారు.
పలు రాష్ట్రాలు ప్రస్తుతం వినియోగిస్తున్న టెక్నాలజీలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, ఈ కారణంగా పథకాల అమలులో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వీటిని అధిగమించి పూర్తి ఫలాలను లబ్ధిదారులకు అందించాలన్న ఉద్దేశంతోనే సంస్కరణలకు ‘స్మార్ట్’ సిస్టమ్ ద్వారా శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోని చౌకధరల దుకాణాల్లో ఈ సాఫ్ట్ వేర్ వినియోగంలోకి వస్తుందని, గతేడాది అక్టోబరులోనే అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు గుర్తుచేశారు.
Also read: TG Govt – HMDA: హెచ్ఎండీఏ నుంచి 36 గ్రామాలు ఔట్.. కొలిక్కొచ్చిన మెట్రో కారిడార్.. ఆ తర్వాత?
ఈ నూతన విధానం కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 81.35 కోట్ల కుటుంబాలల్లో (ఆహార భద్రతా చట్టం పరిధిలోని) దాదాపు 80.56 కోట్ల కార్డులకు (99.03%) ప్రయోజనం కలగనున్నదని, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద అందిస్తున్న ఉచిత బియ్యం, గోధుమలను అందుకోడానికి వీలవుతుందన్నారు. కొత్త సాఫ్ట్ వేర్ వినియోగం కారణంగా సెంట్రలైజ్డ్ సెర్వర్, డాటా సెంటర్లలో కొన్ని మార్పులు జరగనున్నాయని, క్లౌడ్ ఆధారితంగా లబ్ధిదారులకు సేవలు సంతృప్తికరంగా అందుతాయని పేర్కొన్నారు.