తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ: New Schemes In TG: సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా, పరిమిత ఆర్థిక వనరులతోనే ఫలవంతమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయటంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల వేదికగానే వర్గాల వారీగా పథకాలు, వాటి కేటాయింపులు ఉండేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి సభ విజయవంతం కావటం ప్రభుత్వానికి ఊరట నిచ్చింది. ఇదే తరహాలో వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేలా, భవిష్యత్ లో వీరంతా ప్రభుత్వానికి సహకరించేలా చూడాలనే వ్యూహంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సభ ప్రభుత్వానికి కొత్త ఊపును ఇచ్చింది. రైతులు, మహిళలు, యువత ఇలా విభిన్న వర్గాలను లక్ష్యంగా చేసుకుని పథకాల రూపకల్పన చేయటం, వీలైనంత మంది లబ్దిదారులకు ఈ పథకాల ఫలాలు చేరాలనేది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రాజీవ్ యువ వికాసం పథకాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధే లక్ష్యంగా మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ప్రస్తుత బడ్జెట్ లోనే ఈ పథకానికి ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం పదేళ్లలో ప్రధానంగా యువతను నిర్లక్ష్యం చేసిందని భావిస్తున్న ప్రజా ప్రభుత్వం ఈ వర్గాన్ని టార్గెట్ చేసుకుని దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అధికారంలోకి వచ్చిన మొదటి పధ్నాలుగు నెలల్లోనే సుమారు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలని ఇవ్వగలిగామని ప్రభుత్వం చెబుతోంది. మొదటి ఏడాదిలో 55 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా గ్రూప్ వన్, గ్రూప్ టూ ఫలితాలతో పాటు జూనియర్ లెక్చరర్ నియామక పత్రాలనూ అందించింది. ఈ అన్ని విజయాలను ఒక పెద్ద సభ రూపంలో, అలాగే జిల్లాల వారీగా సదస్సుల ద్వారా ప్రచారం చేయాలనే భావనతో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఇక రైతులు, రైతు కూలీలను కూడా ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యేలా ప్రణాళిక రూపకల్పన ఉండబోతున్నట్లు సమాచారం. రుణమాఫీ, రైతు భరోసా పెంపు, రైతు కూలీలకు సహాయం, సన్న బియ్యంకు బోనస్ తదితర విజయాలతో ఒక భారీ భహిరంగ సభకు గతంలోనే ప్రభుత్వం ప్లాన్ చేసింది. స్వయంగా రాహుల్ గాంధీని ఆహ్వానించి, సభ పెట్టాలని భావించినా ఇంకా అమలు కాలేదు. అందుకే రైతు విజయోత్సవ సభను త్వరలోనే ఏర్పాటుచేసేందుకు కసరత్తు జరుగుతోంది.
రైతుల విషయంలో చేసిన పనులను చెప్పుకోలేపోతున్నామనే భావనలో సర్కారు పెద్దలు ఉన్నారు. పైగా ప్రతిపక్ష అనుకూల సోషల్ మీడియా చేస్తున్న నెగిటివ్ ప్రచారం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తొలి యేడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం గతంలోనే వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ ల్లో మూడు సభలను ఏర్పాటు చేసింది. మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యూత్ ఎంపవర్ మెంట్ పేరుతో ఈ సభలను విజయవంతంగా ప్రభుత్వం నిర్వహించింది. ఇదే తరహాలో భవిష్యత్ లో వివిధ వర్గాల సభలు, సమావేశాలు ఉండబోతున్నాయి.