Nagababu on YS Jagan: మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కొణిదెల నాగబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకొని జయకేతన సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధిస్తుందన్న విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందే గ్రహించారన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీని అందిస్తారని పవన్ తనతో ముందుగానే చెప్పారంటూ నాగబాబు తెలిపారు.
నాగబాబు బహిరంగ సభలో ఈ మాట చెప్పగానే అభిమానులంతా కేరింతలతో హోరెత్తించారు. ఇక జగన్ ను ఉద్దేశించి నాగబాబు మాట్లాడుతూ.. వైసీపీ గురించి చెప్పుకోకుండా జయకేతన సభను ముగించలేమన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పడం, కామెడీగా ఉందంటూ నాగబాబు అన్నారు. ఏపీలో ఇంకో 20 – 30 ఏళ్ల తర్వాత జగన్ నిద్రలేవాలని, అప్పటివరకు వైసీపీకి అధికారం దక్కే అవకాశం లేదన్నారు.
Also Read: Ambati Rambabu: పవన్ ప్లీజ్.. ఆ ఒక్క కోరిక తీర్చండి! అంబటి సంచలన వ్యాఖ్యలు
పవన్ విజయానికి ఇంకెవరో దోహదపడ్డారని అనుకోవడం అది వారి ఖర్మ అంటూ నాగబాబు చెప్పడం విశేషం. వచ్చే రోజుల్లో ఏపీకి స్వర్ణ యుగం రానుందని, పదవులు వచ్చినా రాకపోయినా ప్రజలకు సేవ చేసేందుకు జనసేన క్యాడర్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అయితే పవన్ కళ్యాణ్ అంత గొప్పగా కావాలని, లేదంటే గొప్ప వ్యక్తికి అనుచరుడిగా మారాలని జనసేన క్యాడర్ కు నాగబాబు సూచించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగాఉండాలని, అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆచితూచి మాట్లాడాలని నాగబాబు సూచించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏం జరిగిందో చూశామని, వైసీపీని ఉద్దేశించి నాగబాబు విమర్శించారు. కొందరు అహంకారం తలకెక్కి మాట్లాడారని నాగబాబు చేసిన కామెంట్స్.. ఇప్పుడు వైరల్ గా మారాయి. నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని చర్చ సాగుతోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మనా, లేక వైసీపీని ఉద్దేశించి కామెంట్స్ చేశారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.