తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Meenakshi on Congress: ఇతర పార్టీల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే ఆలోచనలకు కాంగ్రెస్ బ్రేక్ వేసింది. ఇప్పటికే చేరిన పలువురు నేతలతో సమస్యలు తలెత్తిన కారణంగా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. ఏఐసీసీ, పీసీసీ నేతలు ఇటీవల నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఇప్పటికే చేరిన నేతలు సంతోషంగా లేకపోవడం, సొంత పార్టీ కేడర్‌లో తలెత్తిన అసంతృప్తి.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తాత్కాలికంగా గేట్లను క్లోజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ గా బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ ఇటీవల రెండు రోజుల పాటు గాంధీభవన్‌లో నిర్వహించిన సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో వారి నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పెరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒకరిపై మరొకరు కంప్లైంట్స్ చేసుకోవడంతో పార్టీలో కొత్త సమస్యలు తలెత్తినట్లు స్పష్టమైంది.
వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడున్న సమస్యలను కొలిక్కి తేవడంతో పాటు కొత్త సమస్యలకు అవకాశం లేకుండా తాత్కాలికంగా చేరికలను ఆపేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ నేతల సమాచారం. కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు ప్రగాఢంగా నమ్ముతున్నా పీసీసీ మాత్రం భిన్నమైన అభిప్రాయంతో ఉన్నది.
కానీ చేరిన ఎమ్మెల్యేల వెంట కార్యకర్తలు సైతం వందల సంఖ్యలో నియోజకవర్గాల్లో పనిచేస్తున్నందున సొంత పార్టీ కేడర్‌తో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని, ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుని చివరకు పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదైన అంశంపై మీనాక్షి ఒకింత అసహనంతో ఉన్నట్లు తెలిసింది. పది మంది ఎమ్మెల్యేలు చేరిన తర్వాత ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలీసు స్టేషన్లలో నమోదైన ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ తదితరాలపై ఆరా తీసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు చేరిన తర్వాత పార్టీ బలోపేతం కావడానికి బదులుగా గ్రూపులవారీగా విభజన రేఖ రావడం పార్టీలో ఒకింత ఆందోళనకరమైన పరిస్థితికి దారితీసిందనేది హస్తం నేతల బలమైన అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభావం తగ్గిపోవడం, ఇప్పటికిప్పుడు బీజేపీ పుంజుకునేంత పరిస్థితి లేనందువల్ల కాంగ్రెస్ పార్టీలోకి చేరికల అవసరం లేదన్నది పార్టీ భావన. కొత్తగా ఎమ్మెల్యేలను చేర్చుకుని శాసనసభలో బలాన్ని పెంచుకోవాలనే అవసరం అంతకన్నా లేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తున్నది.
బీఆర్ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత మినహా ఎవ్వరూ మిగలరంటూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గతంలో కామెంట్లు చేయడంతో చేరికలు పెరుగుతాయనే అభిప్రాయం నెలకొన్నది. కానీ తాజా పరిస్థితులు భిన్నంగా ఉండడంతో జాయినింగ్స్ లేకపోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికింకా పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన నియోజకవర్గాల్లో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస లీడర్ తరహాలో కార్యకర్తలు గ్రూపులుగా ఏర్పడడంతో అది పార్టీపై మంచికన్నా చెడు ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నదని, తొలుత దీన్ని చక్కిదిద్దిన తర్వాత కొత్త జాయినింగ్స్ విషయాన్ని ఆలోచించాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
అధికారంలోకి వచ్చి ఏడాది దాటినందున తొలుత రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళడం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం కావడం.. ఇలాంటి అంశాలపై ప్రధాన దృష్టి పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనికి తోడు ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం లేనందువల్ల దాన్ని గాడిన పెట్టేంత వరకు మొత్తం ఫోకస్‌ను సంస్థాగత వ్యవహారాలపై పెట్టి ఆ తర్వాతనే జాయినింగ్స్ గురించి ఆలోచించాలని భావిస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి.
త్వరలోనే మీనాక్షి నటరాజన్ మరోసారి రాష్ట్రానికి వచ్చి పార్టీ తాజా పరిస్థితిని రివ్యూ చేసి ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత స్పష్టత ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది.
Also Read: Bihar Crime: చోరీలలో ఇదో వెరైటీ.. గోల్డ్ రింగ్స్ మింగేసి మరీ..
అప్పటివరకూ చేరికలకు ఆసక్తి చూపాల్సిన అవసరం లేదనే మెసేజ్ ఇప్పటికే సీనియర్ నేతలకు వెళ్ళినట్లు తెలిసింది. గత కొంతకాలంగా చేరికల వ్యవహారపై కాంగ్రెస్ నేతలు మాట్లాడకపోవడంతో పాటు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుపై ఎలాంటి తీర్పు వస్తుందో తేలిన తర్వాతనే మళ్ళీ దీనికి కదలిక ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.