Kurnool District: హోలీ(Holi)… రంగులు జల్లుకుంటూ చేసుకొనేది ఈ ఒక్క పండుగే. అన్ని పండుగలు వేరు.. హోలీ వేరు. తెలుగు నాట పండుగ అంటే… ఇళ్లల్లో పిండివంటలు చేసుకోవడం, భగవదారధన, కుటుంబంతో కలిసి సరదాగా గడుపడం పరిపాటి. కానీ హోలీ రోజు మాత్రం డిఫరెంట్. ఈ రోజు స్నానం ఎంత లేటుగా చేస్తే అంత మంచింది. ముందు చేస్తే మొదటికి మోసం రాగలదు. చాటుగా ఏ బావమరిదో వచ్చి మొత్తం రంగులన్నీ పూసేస్తాడు మరీ! సో… అలా చిన్నా, పెద్దా తారతమ్యం మరిచి రంగుల్లో మునిగితేలడమే హోలీ ప్రత్యేకత. అయితే ఈ పండుగను ఆయా ప్రాంతాల్లో ఆయా రకాలుగా జరుపుకుంటుంటారు.
ఇప్పుడు తగ్గిపోయింది కానీ… తెలంగాణలో కాముని పున్నమికి(హోలీ మరోపేరు) వారం, పది రోజుల ముందు పిల్లలంతా ‘కోలలాట’ ఆడేవారు. కొంతమంది గ్రూపుగా ఏర్పడి… ఇంటింటికి తిరిగి జానపదాలు పాడుకుంటూ తిరుగుతారు. వాళ్లకి దానంగా ఎవరికి తోచింది వాళ్లు ఇచ్చేవారు. కొంతమంది డబ్బులిస్తే, ఇంకొంతమంది బియ్యం వగైరా ఇస్తుండేవారు. వాటన్నింటిని దాచుకొని హోలీ రోజు బాగా ఆడిన తర్వాత అందరూ కలిసి వనభోజనాలకు వెళ్లి ఆ వచ్చిన వాటితో వండుకొని తినేవారు. అలాగే.. కొన్ని వర్గాల్లో ఆడవాళ్లు కూడా ఇళ్లకి వచ్చి పాటలు పాడేవారు. ‘‘హోలీ హోలీల రంగ హోలీ… చెమ్మకెలీల హోలీ’’ పాటలు అవే. అలా, కాముని పున్నమిని అందరూ సెలబ్రెట్ చేసుకోవడం అక్కడి సంస్కృతి.
వింత ఆచారం – జంబలకిడిపంబ
అలాగే కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో హోలీని వింత ఆచారంతో జరుపుకుంటారు. గ్రామంలో ఉండే మగవారంతా చీరలు ధరించి స్త్రీల వేషధారణలో ముస్తాబవుతారు. అలా చీర, బొట్టు, గాజులు, పూలు ధరించి రతీమన్మథు(Ratimanmadha)లకు మొక్కులు తీర్చుకుంటారు. ఇదే అక్కడి వింత ఆచారం. మరో విశేషం ఏంటంటే… ఈ వింతను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఆ గ్రామానికి తరలివస్తుంటారు కూడా.
ఇంతకీ అదీ ఏ ఊరంటే.. కర్నూలు జిల్లా(Kurnool District) ఆదోని(Adoni) మండలం సంతెకుడ్లూరు(santhekudlur). తరతరాలుగా అక్కడ ఈ ఆచారం పాటిస్తున్నారు. ఏటా హోలీ రోజున.. మగవాళ్లందరూ స్త్రీ వేషధారణలో ఆలయానికి వెళ్లి రతీమన్మథ స్వామికి పూజలు నిర్వహిస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా పిండివంటలను నెవైద్యంగా సమర్పిస్తారు. ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరుగుతాయి.
అయితే… కేవలం చదువుకోని వాళ్లు, పాత జనరేషన్ వాళ్లే ఇలా మగువల్లా మారతారనుకుంటే పప్పులో కాలేసినట్లే. బాగా చదువుకున్న వారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేసుకునే వారు కూడా ఏ సంకోచం లేకుండా ఇందులో భాగస్వాములవుతారు.
డప్పుల దరువులతో ఆలయానికి
ఇక, ఆచారంలో భాగంగా ఆడ వేషం వేసుకున్న మగపురుషులు సాదాసీదాగా కోవెలకు వెళ్తారా అంటే లేదు. కుటుంబ సభ్యులతో సహా మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తునప్పుడు డప్పు సందళ్లతో కోలాహాలంగా వెళ్లి రతీమన్మథులను దర్శించుకుంటారు. ఇదేందయ్యా అంటే.. అదంతే తమ ఆచారమంటూ గ్రామస్థులు చెబుతున్నారు.
సంతెకుడ్లూరు కర్నాటక సరిహద్దుల్లో ఉన్నందున చుట్కుపక్కల ఉండటంతో అక్కడి ప్రాంతాల వారు కూడా ఈ గ్రామానికి విచ్చేస్తారు.