Janasena Party
ఆంధ్రప్రదేశ్

Janasena Party: ఎర్రబడ్డ పిఠాపురం.. కదిలివచ్చిన జనసైనికులు..

పిఠాపురం, స్వేచ్ఛ: Janasena Party: ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న జనసేన 12వ ఆవిర్భావ సభ ఇవాళ (మార్చి 14) పిఠాపురం వేదికగా జరగనుంది. నియోజకవర్గ పరిధిలోని చిత్రాడలో దాదాపు 50 ఎకరాల సువిశాల ప్రాంగణలో సభకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిసారి అధికార పక్షంలో జనసేన భాగస్వామిగా ఉండడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి జరుపుకుంటున్న తొలి ఆవిర్భావ వేడుక కావడంతో పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. చిత్రాడలో పార్టీ సర్వసిద్ధం చేసింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఈ బహిరంగ సభ ప్రారంభం కానుంది.

వేదికకు అర కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు హెలీకాప్టర్‌ ద్వారా పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ఆయన దాదాపు 90 నిమిషాలపాటు ప్రసంగించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభ ప్రారంభానికి ముందు వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనసేన ప్రస్థానంపై రకరకాల కార్యక్రమాలు ఉండనున్నాయి. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా ఒక లైవ్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. దూరంలో ఉన్నవారికి సైతం వేదికపై ఉన్నవారు కనిపించేలా వేదికను బాగా ఎత్తుగా సిద్ధం చేశారు. ప్రధాన వేదికగా 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.

ఇక, వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్‌కు 5 ప్రాంతాలను ఎంపిక చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది జనసైనికులు ఈ సభకు హాజరవుతారని అంచనాగా ఉంది. తొలిసారి ఎమ్యె్ల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజల సమక్షంలోనే పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

ఈ సభకు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు1,600 మంది పోలీసులు భద్రత కల్పించనున్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లా ఎస్పీ నాలుగు రోజులుగా చిత్రాడ సభ వేదిక వద్ద ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. వివిధ ప్రాంతాలవారు చిత్రాడ చేరుకునేందుకు రూట్ మ్యాప్ ఎలా అనుసరించాలి, సభకు వచ్చేవారికి ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధంగా నడుచుకోవాలి? వంటి ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తున్నారు.

వీవీఐపీలు ఎక్కడ కూర్చోవాలి, వాహనాల పార్కింగ్ ఎక్కడ ఉండాలి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఏయే ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలనే దానిపై ప్రణాళికాబద్ధంగా సూచనలు చేశారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దాదాపు 75 సీసీ కెమెరాలను సైతం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వేదిక ప్రాంగణలో ఎల్ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పరిశీలించి సిద్ధం చేశారు.

జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన ఫ్లెక్సీలు, జెండాలు వారం రోజుల ముందు నుంచే కనిపిస్తున్నాయి. ఆ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగింది. కీలక నేతలు, ద్వితీయశ్రేణి నేతలు, జనసైనికులతో చిత్రాడ ప్రాంగణం రంగులమయంగా మారిపోయింది. జనసేన సాధారణ కార్యకర్తల నుంచి సీనియర్ నాయకుల వరకూ అందరిలో ఆవిర్భావ సభ జోష్ కనిపిస్తోంది.

జగన్‌ను టార్గెట్ చేస్తారా?
అధికార పక్షంలో భాగస్వామిగా ఉండి ఈ 9 నెలల కాలంలో జనసేన సాధించిన విజయాలను ‘ఛలో పిఠాపురం’ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అందుకు, అనుగుణంగానే కార్యక్రమాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే, ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా ఉండబోతోందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అధికార పక్షంలో భాగస్వామిగా ఉండి సాధించిన విజయాలను గుర్తుచేయడం ఖాయం. అయితే, సభ వేదికగా విపక్ష వైఎస్సార్‌పీపై ఏ స్థాయిలో ఎటాక్ చేస్తారనేది ఉత్కంఠంగా మారింది.

‘కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ’ అంటూ ఇటీవల వైసీపీ అధినేత తీవ్ర విమర్శ చేసిన నేపథ్యంలో వైఎస్ జగన్‌ను పవన్ ఏ రేంజ్‌లో టార్గెట్ చేయబోతున్నారు?, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనేది హాట్‌టాపిక్‌గా మారింది. సూపర్-6 అమలు చేయలేకపోతున్నారని, కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని విపక్షం విమర్శలు చేస్తుండడంతో వాటికి పవన్ కళ్యాణ్ ఏ సమాధానం ఇవ్వబోతున్నారని శుక్రవారం తెలిసిపోనుంది.

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?