తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ: Raja Singh: కాషాయ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు క్రెడిట్ తమదేనని చెప్పుకుంటున్న పలువురు సీనియర్లను కొద్దిరోజులు కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేయనివ్వని పరిస్థితి కమలదళంలో నెలకొంది. తెలంగాణ బీజేపీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలోని పాత నేతలను టార్గెట్ చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణలో పార్టీ బాగుపడాలంటే పాత నేతలను తప్పించాల్సిందేనని గోషామహల్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కమలదళంలో చిచ్చురేపింది.
తెలంగాణలో కాషాయ పార్టీ అధికారంలోకి రావాలంటే పార్టీలో ఉన్న పాత సామాను బీజేపీ నుంచి బయటికి వెళ్లిపోవాలని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఆ పాత సామాన్లు పనికిరావని పాత నేతలపై ఘాటుగా స్పందించారు. సీనియర్లను పాత సామాన్లతో పోలుస్తూ ఘాటుగా స్పందించడంపై పార్టీలో జోరుగా చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ బీజేపీ తన పార్టీ అని, తన అయ్య పార్టీ అని భావిస్తున్న నేతలు బీజేపీలో చాలా మంది ఉన్నారని, వాళ్ళందరికీ రిటైర్మెంట్ ఇవ్వాలని రాజాసింగ్ హైకమాండ్ ను కోరారు. ఈ విషయాన్ని గమనించాలంటూ అధిష్టానం పెద్దలను ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేశారు.
రాజాసింగ్.. అక్కడితోనే ఆగకుండా తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. సరే.. ఆ ముఖ్యమంత్రితో బీజేపీ నేతలు సీక్రెట్ మీటింగ్స్, ఒప్పందాలు చేసుకుంటున్నారని బాంబు పేల్చారు. అలాంటి పరిస్థితిలో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం తాను చెబుతున్నది కాదని, ప్రతి కార్యకర్తలు ఇలాగే అనుకుంటున్నారని చెప్పడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రాజాసింగ్ వ్యాఖ్యలతో పార్టీలో మరో కొత్త చర్చ మొదలైంది. గోషామహల్ ఎమ్మెల్యే టార్గెట్ చేసిన సీనియర్లు ఎవరనేది అందరి మెదళ్లను తొలుస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారా? అనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్నది వారే. సీనియర్లుగా ఉన్నదీ వారే కావడంతో వారిని ఉద్దేశించే అలా వ్యాఖ్యలు చేసి ఉంటారని శ్రేణులు భావిస్తున్నాయి. అయితే తెలంగాణలో బీజేపీ ఫెయిల్యూర్ అవుతున్నది ఎవరిని ఉద్దేశించి చేసి ఉంటారని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అదీ పోగా.. అధికారంలోకి వచ్చిన సీఎంలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నది ఎవరనేది చర్చించుకుంటున్నారు.
బీజేపీలో కాంట్రవర్సీకి కేరాఫ్ గా రాజాసింగ్ కొనసాగుతున్నారు. ఆయన ఏం చేసినా దాదాపు అలాగే ఉంటుంది. గతంలో కూడా బీజేపీలో బీసీ నినాదం ఎక్కడుందని?, బీసీలకు న్యాయం ఎక్కడుందని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా సంస్థాగత అధ్యక్ష ఎన్నికల తీరును సైతం ఆయన తప్పుబట్టారు. అమ్యామ్యాలకి అధ్యక్ష పదవులు ఇస్తారా అంటూ ఆరోపణలు చేసిన దాఖలాలున్నాయి. తాజాగా పాత నేతలు పార్టీకి పనికి రారని రాజాసింగ్ చేసిన కామెంట్స్ తో పాత నేతల పంచాయితీ మరోసారి రచ్చకెక్కింది.
రేపోమాపో స్టేట్ చీఫ్ అనౌన్స్ మెంట్ జరుగుతున్న తరుణంలో రాజాసింగ్ వాఖ్యలు బీజేపీలో దుమారం రేపుతున్నాయి. మరి రాజాసింగ్ కామెంట్స్ పై పార్టీ ఎలా స్పందింస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి సీనియర్లను టార్గెట్ చేయడంతో హైకమాండ్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.